కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ హార్డ్ వేర్ షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 7 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఓ కొలిక్కి రాని పరిస్థితి అక్కడ తలెత్తింది. ఆ మంటలకు ఆ భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. భవనం పై అంతస్తులో ఎలక్ట్రిక్, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే షాపు ఉంది. ఈ షాపులోనే మంటలు అంటుకున్నాయి. ఈ షాపు కిందనే ఒక ప్రముఖ సంస్థకు చెందిన నగల షాపు ఉంది.
మరోవైపు వస్త్రదుకాణం, ఇంకొక నగల షోరూమ్ కూడా ఉంది. దీంతో మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తపడుతున్నారు. మంటలు నగల దుకాణాలకు వ్యాపిస్తే అందులో ఉన్న బంగారం కరిగిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలను షాపు యజమానులు వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో లోపలికి వెళ్లలేని పరిస్థి ఉండటంతో మంటలను నీళ్లతో అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పెయింటింగ్ డబ్బాల స్టాక్ షాపులో పెద్ద ఎత్తున ఉండడంతోనే మంటలు భారీగా అంటుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సుమారు రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మంటలు కాస్త అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read ;-ఆ లాఠీఛార్జి.. వారిలో ఎలాంటి మంట పుట్టించిందంటే..











