బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషి కపూర్ మరణించి ఏడాది దాటింది. అక్కినేని నాగేశ్వరరావు మాదిరిగానే చివరి వరకూ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అక్కినేనిని క్యాన్సర్ మహమ్మారి ఎలా కబళించిందో రిషి కపూర్ ను కూడా అలాగే కబళించింది. కాకపోతే చిన్న వయసులోనే రిషి కపూర్ కన్నుమూశారు. ఆయన చివరి చిత్రం ‘శర్మాజీ నామ్ కే’ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ సినిమా కోసం ఆయన కొంత షూటింగ్ కూడా చేశారు. 2018లో ఈ సినిమా మొదలైనా క్యాన్సర్ చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లడంతో చిత్రీకరణ వాయిదా పడింది.
ఈరోజు ఆయన కుమార్తె రిద్దిమా ఆ సినిమా మొదటి పోస్టర్ ను విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్ లో అప్పట్లో రిషి గెటప్ తో పాటు ఇప్పుడు ఆ పాత్ర పోషించిన పరేష్ రావెల్ గెటప్ కూడా ఉంది. మొత్తానికి ఈ సినిమాను పరేష్ రావెల్ తో పూర్తిచేస్తున్నారు. ఈ సినిమాలో రిషి కపూర్, పరేష్ రావెల్ తో పాటు జుహీ చావ్లా, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
జుహీ చావ్లా పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రిషి కపూర్ పాత్రను తాను కొనసాగించడంపై పరేష్ రావెల్ మాట్లాడుతూ ‘నేను చాలా కాలం తర్వాత మంచి స్క్రిప్టు చూశాను. నిజానికి ఈ పాత్రను రిషి పూర్తి చేసి ఉంటే మరోసారి ఆయన స్టామినాని జనం చూసేవారు. ఆయన ఏ పనిచేసినా అద్భుతం. ఆయన ఈ సినిమాను పూర్తి చేయలేకపోవడం నాకే నాకు నష్టం’ అన్నారు. దాదాపు దశాబ్దం తర్వాత జుహీచావ్లా, రిషిల అపూర్వ కలయిక ఈ సినిమా ద్వారా జరిగింది.
అంతకుముందు వీరు బోల్ రాధా బోల్, ఈనా మీనా డీకా, దారార్, సాజన్ కా ఘర్ లాంటి చిత్రాలు చేశారు. 2009లో లక్ బై ఛాన్స్ జుహీ రిషీతో నటించింది.‘శర్మాజీ నామ్ కే చిత్రానికి హితేశ్ భాటియా దర్శకత్వం వహించారు. ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్, మాక్ గఫిన్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇది 60 ఏళ్ల వ్యక్తి కథ. దీని ట్రైలర్ త్వరలోనే జనం ముందుకు రానుంది. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో రిషి లుక్ తో పాటు పరేష్ రావెల్ లుక్ ను కూడా విడుదల చేశారు.











