తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర . కేసీఆర్ ఏ మాట చెబితే దానికి తమ కార్యచరణ సిద్దం చేసే వారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవారు. ఉద్యమంలో భాగంగా ఎన్నో సార్లు పెన్ డౌన్ చేశారు.. సహాయ నిరాకరణ చేశారు. తోటి ఆంధ్రా ఉద్యోగులతో గొడవలకు కూడా దిగేవారు. ఆ నాడు ఉద్యోగ సంఘాల నేతలంటే ఎంతో ఫవర్ ఫుల్. ఆ సంఘాల నేతలంటే ముఖ్యమంత్రులు సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చి వారి సమస్యలు వినేవారు. లక్షలాది మంది ఉద్యోగులను ఒక్క మాటతో ఉద్యోగ సంఘాల నేతలు తమ కంట్రోల్‌లోకి తెచ్చుకునే వారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆ ఫవర్‌ఫుల్ నేతలకు రాజకీయ పదవులు కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా అవకాశం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు, తెలంగాణ సమాజం అంతా సంతోషం వ్యక్తం చేశారు.
పరిస్థితులు తారుమారు..
తెలంగాణ వచ్చిన సమయంలో జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీలో వారికే పెద్ద పీట వేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే స్వామీ గౌడ్‌కు మండలి చైర్మన్ పదవి కట్టబెట్టారు. టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రిపదవి కట్టబెట్టారు. వారిని ప్రభుత్వంలోకి తీసుకోవడంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి ప్రభుత్వంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. ఉద్యోగ సంఘం నేతల పదవీ కాలం ముగియడంతో పాటు , ఎన్నికల్లో అవకాశం ఇచ్చినా గెలుపొందక మరొకరు తెరమరుగైపోయారు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. స్వామీగౌడ్ పదవీ కాలం ముగియక ముందే తనకు రెన్యూవల్ ఉంటుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏ పదవి ఇచ్చినా పని చేస్తా అని చెప్పుకున్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనకు ఏ పదవీ దక్కలేదు. దీంతో ఆయన అలక బూనినట్టు తెలుస్తోంది . ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్‌ల అపాయింట్ మెంట్ కోరినా దొరకడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే కోవలో మరో నేత దేవీ ప్రసాద్..
టీఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసిన మరో నేత దేవీ ప్రసాద్. ఆయన ఉద్యోగ సంఘం నేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఒకరు. ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన సేవలకు గుర్తింపుగా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ స్థానంలో పోటీచేసిన బీజేపీ నేతల రాంచందర్ రావు గెలుపొందారు. ఆ తరువాత దేవీ ప్రసాద్ తెరమరుగై పోయారు. ఆయన ప్రస్తుతం మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఉద్యోగ సంఘం నేతగా ఉన్న సమయంలో ఆయన ఉద్యోగుల సమస్యలపై నిరంతరం మీడియాలో హడావుడి చేసేవారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారన్న ఆశతో ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన పేరును చాలా మంది మరచిపోయారు. ఇంకొన్ని రోజులు పోతే కేసీఆర్ కూడా ఆయన పేరును మరచిపోయే పరిస్థితి ఉందంటూ సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యమం ఉన్నన్ని రోజులు ఓ వెలుగు వెలిగిన ఈ నేతలు ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో కాలం వెళ్ళదీయాల్సిన దుస్థితి నెలకొందని విపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.