హైదరాబాద్‌కు వరదలు ఏ క్షణాన వచ్చాయో తెలియదుగానీ రాష్ట్ర రాజకీయాలన్నీ గత నెల రోజుల నుంచి ఈ వరదల చుట్టే తిరుగుతున్నాయి. ఎక్కడ చూసిన ఈ వరద సాయం గురించే చర్చ. వరదలు హైదరాబాద్‌ను ఎంతలా ముంచెత్తాయో మనకు తెలిసిందే. దీంతో లక్షలాది కుంటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కాలనీలన్నీ నీటమునిగి ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లను విడుదల చేస్తూ ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.
అయితే మొదట ఈ వరద సాయాన్ని నేరుగా వరద బాధితులకు ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందించారు. సాయం అందజేయడంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు విపక్ష పార్టీలు, ప్రజల నుంచి రావడంతో వరద సాయం కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీంతో సాయం అందని వారందరూ కూడా మీసేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. వేల మంది బాధితులు కేంద్రాల ముందు క్యూ కట్టారు. ఈ తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన మొదటి రోజు వరద సాయానికి సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంటూ వరద సాయం అందించడాన్నినిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో వరద సాయాన్ని నిలిపివేశారు. ఇది వివాదాస్పదమైంది. ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకు ఖాతాల్లో డబ్బలు పడలే…
ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు ముందు రోజు ఎవరైతే వరద సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకి బుధవారం కొంత మంది మొబైల్ ఫోన్లకు తమ ఖాతాలో డబ్బులు పడ్డట్లు మెస్సేజ్‌లు వచ్చాయి. అందులో ‘ ఇటీవల కురిసన భారీ వర్షాలు మరియు వరదలు సమయంలో మీ ఇంటి వస్తువులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీ కోసం రూ.10000 మంజూరు చేయబడింది. ఈ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్సఫర్ చేయబడింది. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు సహాయకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కమిషనర్ జీహెచ్ఎంసీ. ’ అని పేరుతో మెస్సెజ్ లు వచ్చాయి. ఖాతాలో డబ్బలు పడ్డాయి కదా అని బాధితులు బ్యాంకులకు వెళ్లి డ్రా చేసుకుందామని అక్కడి అధికారులను అడిగితే ఖాతాలో డబ్బులు పడలేదని బదులివ్వడంతో బాధితులు అవక్కయారు. ఖాతాలో డబ్బులు ఎందుకుపడలేదో తమకు తెలియదని బ్యాంకు అధికారులు సమాధానమిస్తుండటంతో బాధితులంతా నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు. అలాగే ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పడ్డాయని ఇలా మోసం చేయడమేంటని ఆరోపిస్తున్నారు. సాయం పేరుతో తమతో నాయకులు ఆడుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల చుట్టూ..
నిన్నటిదాకా వరద సాయం కోసం మీసేవాల చుట్టూ తిరిగిన బాధితులు ఇప్పడు ఆ సాయం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వరద సాయం వస్తుందో లేదో తెలియదు గానీ సాయం కోసం మీసేవా, బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి తమ ప్రాణాలు పోయేలా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండలో ఓ మహిళ వరద సాయం దరఖాస్తు కోసం మీసేవా కేంద్రం ముందు క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి చనిపోయిన విషయం తెలిసిందే.
Must Read ;- నిండా మునిగినోళ్లనీ.. దయ లేకుండా దోచేస్తున్నారు!











