DL Ravindrareddy Has Announced That He Will Contest 2024 Elections
దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి గారి రవీంద్రారెడ్డి పేరు తెలియని వారు ఉంటారేమో గానీ.. డీఎల్ రవీంద్రారెడ్డి పేరు మాత్రం తెలుగు ప్రజలకు చిరపరచితమే. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డీఎల్.. పెద్దగా సాధించిందేమీ కూడా లేదనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి అరా సార్లు మంత్రి పదవులను చేపట్టిన డీఎల్.. అంతకుమించి పెద్దగా ప్రాధాన్యం కలిగిన పదవులనేమీ దక్కించుకోలేదనే చెప్పాలి. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన నేతగా, జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గానికి పలు మార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో.. మైదుకూరు పేరు విన్నంతనే రవీంద్రారెడ్డి ఠక్కున గుర్తుకు వస్తారు. మనసులో ఏది ఉంటే దానినే బయటకు పలికే తత్వంతో డీఎల్ మరింత మేర గుర్తింపు సంపాదించుకున్నారు. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్.. ఆ తర్వాత గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత 2009 వరకు ఆయన ఏ పార్టీ వైపూ చూడలేదు. మొత్తంగా ఆరు పర్యాయాలు మైదుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల నాటి నుంచి ఎవరికీ పట్టని నేతగా మారిపోయారు. ఏ పార్టీలోకి వెళదామని ప్రయత్నించినా ఆయా పార్టీల నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం లభించినా గానీ.. ఎందుకనో గానీ డీఎల్ ఏ పార్టీలోకి మారిపోలేదు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నా.. ఇప్పటికీ ఆయన హస్తం పార్టీ నేతగానే కొనసాగుతున్నట్లు లెక్క.
1978లో మొదలైన ప్రస్థానం..
కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిరా) పేరిట వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత 1978లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. జనతా పార్టీ పార్టీ 60 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకే పరిమితమైంది. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారిలో ఏకంగా 15 మంది విజయం సాధించారు. ఆ 15 మందిలో కడప జిల్లా మైదుకూరు నుంచి కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దుగ్గిరెడ్డి లక్ష్మిరెడ్డి గారి రవీంద్రారెడ్డి కూడా ఒకరు. అంటే.. పొలిటికల్ ఎంట్రీనే ఏ పార్టీ అండ లేకుండానే బరిలోకి దిగి సత్తా చాటిన నేతగా డీఎల్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తన నియోజకవర్గం మారకుండానే.. ఐదు పర్యాయాలు, మొత్తంగా ఆరు సార్లు మైదుకూరు ఎమ్మెల్యేగా డీఎల్ గెలిచారు. తనను నమ్ముకున్న వారి కోసం ఎంతదాకా అయినా వెళ్లేందుకు నిత్యం సంసిద్ధంగా ఉండే నేతల్లో డీఎల్ ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. ఈ తత్వమే ఆయనను విలక్షణ నేతగా ఎదిగారని కూడా చెప్పాలి.
DL Ravindrareddy Has Announced That He Will Contest 2024 Elections
రాష్ట్ర విభజనతో కష్టాలు మొదలు
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే కష్టాలు మొదలయ్యాయో, ఆ పార్టీకే చెందిన చాలా మంది నేతల మాదిరే డీఎల్‌కు కూడా కష్టాలు మొదలయ్యాయి. 2014 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన డీఎల్.. ఇతరత్రా పార్టీల వైపుగా పెద్దగా చూడలేదు. ఎందుకంటే నాడు విభజిత ఏపీలో కాంగ్రెస్‌తో పాటు వైసీపీ, టీడీపీ మాత్రమే ఉన్నాయి. వైసీపీ వైపు ఎలాగూ దృష్టి సారించని డీఎల్.. టీడీపీ వైపు చూశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడితోనూ భేటీ అయ్యారు. మైదుకూరు టికెట్ ఇస్తే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయారు. అయితే మైదుకూరు టీడీపీ టికెట్ ను అప్పటికే స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఇచ్చేందుకు చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరకుండానే డీఎల్ ఎన్నికలకు దూరంగా నిలబడక తప్పలేదు. అంతేకాకుడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్న జగన్ పై కడప ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం కూడా డీఎల్‌కు ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితినే కల్పించిందని చెప్పాలి. ఆ తర్వాత 2019లో అయినా మళ్లీ యాక్టివేట్ అవుదామన్న కోణంలో ఆలోచించిన డీఎల్.. వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఆ క్రమంలోనే లోటస్ పాండ్‌లో జగన్‌తో బేటీ కూడా అయ్యారు. అయితే మైదుకూరులో ఉన్న పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పక్కనబెట్టి డీఎల్‌కు సీటిచ్చేందుకు జగన్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో డీఎల్ సైలెంట్ అయిపోయారు.
2024లో పోటీ ఖాయమేనట
2019 ఎన్నికలు ముగిసిన తర్వాత రెండేళ్లుగా ఎవరికీ కనిపించకుండాపోయిన డీఎల్.. తాజాగా బయటకు వచ్చారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం తప్పనిసరి అన్న దిశగా కామెంట్ చేసిన ఆయన మరోమారు మీడియాను తనవైపునకు తిప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ ఏమంటారంటే.. ‘‘2024 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ రంగం క్షోభంలో కూరుకుపోయింది. పొలాన్ని కౌలుకు ఇద్దామనుకుంటే.. తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రాష్ట్ర మంత్రులెవరూ వారి శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. సొంత ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు పని చేస్తున్నారు. పాలకుల అక్రమాలను ప్రజలు నిలదీయాలి’’ అంటూ డీాఎల్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. డీఎల్ వ్యాఖ్యలు చూస్తుంటే.. 2024లో ఆయన మరోమారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమేనని చెప్పక తప్పదు.











