వైసీపీ హయాంలో ఏపీలో విద్వేష రాజకీయం నడిచేది. రాజకీయాలు అంటేనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అమరావతి కమ్మరావతి అంటూ ఓ వర్గంపై మరో వర్గాన్ని ఉసిగొల్పడం, ఉత్తరాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం జగన్ హయాంలో వైసీపీ అనుసరించిన ఓ దుర్మార్గమైన వ్యూహం. అభివృద్ధిని వికేంద్రీకరణ పేరుతో విడగొట్టి, కేవలం కక్షసాధింపు రాజకీయాలతో రాష్ట్రాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు.
కానీ, కాలం మారింది. ఇప్పుడు విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రస్తుతం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా..రాయలసీమ నుంచి మొదలుకొని గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకు రాష్ట్రంలోని నలుమూలలా పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఒకరికోసం మరొకరిని బలిచేయడం కాకుండా, ప్రతి ప్రాంతమూ అభివృద్ధిలో పోటీపడే సరికొత్త సువర్ణాధ్యాయానికి తెరలేచింది.
తాజాగా జరిగిన కాకినాడ రీజనల్ కాన్ఫరెన్స్ ఇందుకు సజీవ సాక్ష్యం. గోదావరి రీజియన్‌ను పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ఏకంగా రూ.4,256.61 కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదనలతో 15 ఒప్పందాలు కుదిరాయి. కేవలం పెట్టుబడులే కాకుండా, స్థానిక యువతకు ఏకంగా 14 వేల 261 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో నెక్సాన్ జియోకెమ్ (రూ. 1,250 కోట్లు – 886 ఉద్యోగాలు), జైపురి స్ట్రాటజిక్ రిసోర్సెస్ (రూ. 698 కోట్లు – 4,520 ఉద్యోగాలు), ఇండియన్ ఫాస్ఫేట్ (రూ. 690 కోట్లు – 500 ఉద్యోగాలు), లార్డ్ వెంకీ గ్రీన్ ఎనర్జీ (రూ. 444 కోట్లు – 360 ఉద్యోగాలు), కామినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రూ. 300 కోట్లు – 600 ఉద్యోగాలు) వంటి దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి.
ఇది ఒక్క గోదావరి ప్రాంతానికే పరిమితం కాదు.. రాయలసీమలో సోలార్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలో ఐటీ, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారుతోంది. రాజకీయ విద్వేషాలను పక్కన పెట్టి, కేవలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది.
ఒకనాడు ప్రాంతాల మధ్య గోడలు కట్టి పబ్బం గడుపుకున్న వారికి, నేడు అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతుండటమే ప్రజలిచ్చిన గట్టి సమాధానం. ఏ ప్రాంతం వెనుకబడకుండా, ప్రతీ ఒక్క యువకుడికీ సొంతూరికి దగ్గర్లోనే ఉద్యోగం లభించేలా సాగుతున్న ప్రయాణం..ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అగ్రగామిగా నిలపడం ఖాయంగా కనిపిస్తోంది.!











