కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం కావడం సంచలనమైంది. హైదరాబాద్ ఘట్ కేసర్ ప్రాంతంలో యువతి కిడ్నాప్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. యువతి తల్లికి సమాచారం అందంచింది. యువతి తల్లి పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో.. వారు బృందాలుగా విడిపోయి పరుగులు పెట్టారు. యువతిని సకాలంలో రక్షించాలని సకల విధాలుగా ప్రయత్నించారు. చివరకు యువతిని గుర్తించింది వైద్య సహాయం అందేలా చేశారు. ఆమె కోలుకున్నాక విచారణ చేపడితే.. అసలు విషయం బయటపడింది. ఆమె ఆడిందంతా నాటకమని, స్నేహితులతో బయటకు వెళ్లి.. ఇంట్లో వాళ్లు కోప్పడతారనే భయంతో కిడ్నాప్ డ్రామా అడినట్లు తేలింది. అప్పటి దాకా యువతి సమయస్ఫూర్తిని ఆకాశానికెత్తేస్తూ కథనాలు ప్రచురించిన మీడియా సంస్ధలు తన నిర్వాకాన్ని ఎండగట్టాయి.
ఘటన జరిగిన అనంతరం అమ్మమ్మ వాళ్లింటిలోనే ఉంటుంది యువతి. జరిగిన విషయం బాగా ప్రచారం కావడంతో అందరిలో తన పరువు పోయింది. అంతేకాదు.. తను స్నేహితులతో ఇష్టపూర్వకంగా వెళ్లిన విషయం పైన కూడా పలు కధనాలు ప్రసారమయ్యాయి. దీంతో అప్పటి నుంచి మనస్తాపం చెందిన యువతి షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది.
స్వయంకృతాపరాదం..
యువతి విషయంలో మీడియాలో ప్రచారాలు.. కథనాలు కొంత ప్రభావం చూపాయన్న మాట వాస్తవమే.. కానీ, ఈ విషయంలో ముందుగా తప్పు చేసింది యువతనే చెప్పాలి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఎంతటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఊహించలేకపోయింది. కనిపెట్టలేరులే.. తను చెప్పిన కథంతా నమ్మెస్తారులే అనుకుంది. కానీ, అక్కడే కథ అడ్డం తిరిగింది. పోలీసులు ప్రశ్నలకు యువతి తడబడడంతో అనుమానమొచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిజాన్ని బయటపెట్టారు. ఇంత జరిగనా.. పోలీసులను మెచ్చుకోవాల్సిందే.. అమె పేరు గానీ, సమాచారం గానీ, బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త వహించారు, చివరకు అటో వాళ్లను విచారించినందుకు పోలీసులే క్షమాపణ కూడా చెప్పారు.
కుటుంబ సభ్యుల పాత్ర కీలకం..
ఇలాంటి పనులు చేయనే కూడదు.. కానీ ఒకవేళ చేసినా.. కుటుంబ సభ్యుల కాస్త సంయమనం పాటించడం చాలా అవసరం. ఇలాంటి తప్పు చేసిన వెంటనే పరువు తీసావంటూ.. వారిపైన విరుచుకుపడితే వారిలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పని చేశారంటేనే వారి మానసిక స్ధితి ఎలా ఉందనేది కుటుంబ సభ్యులు గుర్తించాలి. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత వారింకా కుంగుబాటుకు గురవడం ఖాయం. కాబట్టి వారికి వెంటనే కౌన్సలింగ్ ఇప్పించడం లాంటివి చేయడం అవసరం. అంతేకాదు.. అందరూ ఏమనుకుంటే ఏంటి.. కొద్ది రోజులు మాట్లాడుకుంటారు.. నీ పని నువ్వు కొనసాగించు అంటూ కుటుంబ సభ్యులు ఇచ్చే ధైర్యం వాళ్లు మానసికంగా దృఢంగా అవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా జరిగిన తప్పునే గుర్తు చేస్తూ.. ఇలాంటి పని చేశావంటూ నిందిస్తే.. వారు మానసికంగా కుంగిపోవడంతోపాటు.. దారుణమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
యువతకిదో పాఠం..
నేటి తరం యువతలో కాస్త నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువైంది . ఇంట్లో వాళ్లకు భయపడో.. లేదా వాళ్లకు తెలియకుండా దాచాలనో.. నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా పోలీసులను పరుగులు పెట్టించడం ఎంత పెద్ద నేరమో గ్రహించలేకపోతున్నారు. పోలీసులు తల్చుకుంటే వాళ్లపై కేసులు పెట్టి జైలు శిక్ష పడేలా చేయగలరని యువత గ్రహించలేకపోతున్నారు. ఇలాంటి వాటిని చాలా తేలిగ్గా కూడా తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఈ యువతి కథ ఓ గుణపాఠం కావాలి. ఇంట్లో అబద్దం చెబితే ఏముందిలే అని తేలిగ్గా తీసుకుంది. పోలీసుల ఎంట్రీతో కథ కాస్త జఠిలంగా మారడంతో ఏవేవో కథలు అల్లుకుంటూ పోయింది. అవే చివరకు తన ప్రాణాలు తీసింది. ఆ క్షణంలో ఇంట్లో వారితో చెప్పడానికి భయమనిపించవచ్చు. కానీ, మన వారు కాస్త కోప్పడినా., తర్వాత అంతా మూమూలు అయిపోయింది. కానీ, తన అబద్దంతో.. విషయాన్ని చిక్కుముడిలా చేసి తన పరువు, ప్రాణాలు తనే తీసుకుంది.
నేటి యువత క్షణికంగా వచ్చే ఇబ్బందులను తొలగించుకోవడానికి చెప్పే అబద్దాలు ఒక్కో సారి ఇలా పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయి. ఆ క్షణంలో నోటి కొచ్చింది చెప్పేసి తప్పించుకుంటాం అనుకుంటున్నారు. కానీ.. అవి కాస్త వారి మెడకు చుట్టుకుంటున్నాయి. నేటి ఈ యువతి కథ.. నేటి తరానికి ఓ పాఠం కావాలి. క్షణికంగా అబద్దాలు చెప్పి తప్పించుకోవాలనుకునే వారు మున్ముందు ఎదురుకాబోయే పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం నేర్చుకోవాలి.
Must Read ;- అత్యాచారం కట్టు కథేనా..?.. అసలు విషయం రాబట్టిన పోలీసులు