నాడు జీవిఎల్.. నేడు విష్ణు కారణాలైమైనా ఇద్దరిపై జరిగిన దాడి చర్చానీయాంశమవుతోంది. మంగళవారం ఏబీఎన్ లో లైవ్ డిబేట్‌లో అమరావతిపై అమరావతి జేఏసీ నేత, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డిపై చెప్పు విసరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అమరావతిపై ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం సడెన్‌గా అసంపూర్తిగా ఉన్న 50 శాతానికి పైగా పూర్తయిన భవనాలను రూ.3వేల కోట్లతో పూర్తి చేసేందుకు సిద్ధం కావడం, అందుకు అప్పు తీసుకునేందుకు రెఢీ అయిన అంశంపై ‘గ్రాఫిక్స్‌ని పూర్తి చేద్దాం’ శీర్షికతో ఏబీఎన్ ఛానెల్ చర్చా కార్యక్రమం చేపట్టింది.
ఈ చర్చలో భాగంగా మాటా మాటా పెరిగింది. బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే గత ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు.. అమరావతి కోసం ముంబై వెళ్లి గంట కొట్టి మరీ..అని పరోక్షంగా అడుక్కున్నారు అనే స్థాయిలో వెటకారం చేశారు. ఇక్కడే వాతావరణం వేడెక్కింది. అంతటితో ఇరువురూ ఆగినా ఇబ్బంది ఉండేది కాదు. అయినా వాదన పెరగడంతో కొలికిపూడి శ్రీనివాస్ తన చెప్పును పక్కనే ఉన్న విష్ణువర్దన్‌పై విసిరారు. దీంతో అంతా షాక్ తిన్నారు. ఆ చర్చకు స్మాల్ బ్రేక్ ఇచ్చి తరువాత కొనసాగించారు. శ్రీనివాస్‌ను బయటకు పంపారు. ఏబీఎన్ శాశ్వతంగా చర్చా కార్యక్రమాల నుంచి ఆయనను బహిష్కరిస్తున్నట్లు హోస్టర్ వెంకట కృష్ణ ప్రకటించారు. తరువాత తన ఆవేదనను విష్ణువర్దన్ రెడ్డి అదే చర్చా కార్యక్రమంలో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం
ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దళిత నేత, ప్రొఫెసర్‌తో పాటు పలు అంశాల్లో నిష్ణాతుడైన అమరావతి జేఏసీ ఛైర్మన్ కొలికిపూడి శ్రీనివాస్ సంయమనం కోల్పోయి చెప్పు విసరడాన్ని తప్పుబట్టేవారూ ఉన్నారు. అదే సమయంలో మరికొందరు విష్ణువర్దన్ వైఖరినీ తప్పు బడుతున్నారు. చర్చలు, డిబేట్‌లలో వాదోపవాదాలు సహజమని, అయితే యాక్షన్‌కు దిగడం సరికాదని, లక్షలాది మంది చూసే డిబేట్‌లలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదనే చర్చ కూడా నడుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!
గతంలో మహిళల వస్త్రధారణపై విష్ణువర్దన్‌రెడ్డి వ్యాఖ్యలు..
- గతంలో అమరావతి దీక్షలు చేస్తున్న మహిళల వస్త్రధారణపై విష్ణువర్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి నుంచి అమరావతి దీక్షలు చేస్తున్న వారు విష్ణువర్దన్‌ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అదే సమయంలో విష్ణువర్దన్‌రెడ్డి చేస్తున్న, చేసిన వ్యాఖ్యలు, అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమర్థించేవిగా ఉండడం కూడా ఈ ఘటనకు కారణం కావచ్చనే చర్చ నడుస్తోంది.
- నిన్న జరగిన చర్చలో అమరావతి విషయంలో జగన్‌ని సమర్థించే యత్నం చేసిన విష్ణును అడ్డుకున్నారు శ్రీనివాస్. ఈ క్రమంలో మీరు టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే అర్థం వచ్చేలా విష్ణువర్దన్ మాట్లాడడం కూడా ఒక కారణమే. అమరావతిని సమర్థిస్తున్నవారిని ఓ పార్టీకి, ఓ వర్గానికి ముడిపెట్టడం ఏంటనే ప్రశ్న గతంలోనే తలెత్తింది. చర్చ జరుగుతున్న సమయంలో అదే కోణంలో చర్చ జరగడంతో ఈ ఘటన జరిగిందనే చర్చ నడుస్తోంది.
- గతంలోనూ టీవీ చర్చల్లో అప్పట్లో బల్కసుమన్ వంటివారూ ఇలాంటి దాడులు చేశారన్న విషయం కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది.
- ఓవైపు అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న దీక్ష 435 రోజులకు చేరింది. ఆ దీక్ష విషయంలో బీజేపీ ఇటీవలే స్టాండ్ మార్చుకుంది. అమరావతికి జై కొట్టింది. గతంలో అమరావతి విషయంలో పట్టనట్టు బీజేపీ వ్యవహరించిందని, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వానికి అనుకూలమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం ఏంటనే చర్చ నడుస్తోంది.
- ఈ ఘటనపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు చివర రెండక్షరాల తోక చూసుకుని ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ ఊరుకోరని, సీఎం నెల జీతం మీద బతికే పెయిడ్ ఆర్టిస్ట్ మీరని, దళిత ఉద్యమ నేతను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తూ విష్ణువర్ధన్‌రెడ్డి తీరును అనిత తప్పుపట్టారు.
- అదే సమయంలో ఏ కారణంలో ఏబీఎన్ ఛానెల్ కొలికిపూడి శ్రీనివాసరావుని బహిష్కరించిందో ఆ ఘటనకు కారణమైన, ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించిన విష్ణువర్ధన్‌రెడ్డిని ఆ ఛానెల్ వెనుకేసుకు రావడం ఏంటనే చర్చా నడుస్తోంది. ‘అమరావతి పౌరుషం..’ అని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి.
ఖండించిన బీజేపీ నేతలు
- ఇదే ఘటనను బీజేపీ నేతలు జీవీఎల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. ఇది పార్టీపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇక్కడే మరో ట్రోల్ కూడా జరుగుతోంది. 2019 ఏప్రిల్ ధిల్లీలో ఓ ఎంపీ టిక్కెట్ విషయంలో విలేకరులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో జీవీఎల్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఓ వ్యక్తి చెప్పులు విసరడం జాతీయస్థాయిలో వైరల్ అయింది.
- విష్ణువర్దన్‌పై చెప్పులు విసరడం వెనుక మరో అజెండా ఉందని ట్రోల్స్ కూడా వైసీపీ నుంచి వస్తున్నాయి. అదే సమయంలో జీవీఎల్ పై నా చెప్పులు విసిరిన ఘటన వెనుక ఎవరున్నారనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
- ఈ ఘటన ఆధారంగా ఇప్పుడు అమరావతి ఉద్యమానికి వక్రభాష్యం చెప్పే వారూ నిద్రలేస్తారని, ఇన్నాళ్లు కొనసాగుతున్న ఉద్యమంపై కనీసం స్పందించని మేథావులు, కుహానా లౌకికవాదులు ఇప్పుడు మాట్లాడతారనే కామెంట్లూ వస్తున్నాయి.
ఏది ఏమైనా.. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే చర్చా వేదికల్లో దాడులు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో చర్చావేదికల్లో పాల్గొనే వారూ తాము మాట్లాడే ముందు కొన్ని నియంత్రణలు పాటించడం అవసరమనే చర్చా నడుస్తోంది.
Also Read ;- తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?