ఆనాడు జరిగిన దిశ ఘటన దేశాన్ని కదిలించి.. ఆమెకు న్యాయం జరగాలంటూ గొంతెత్తి నినదించింది. ఇదంతా నాణానికి ఒకవైపే.. దిశ కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే.. ప్రమాదం నుంచి బయటపడేదని కొందరు ఆనాడు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దిశ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించినా.. వారు స్పందించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే దిశ ప్రాణాలతో దక్కుండేదని మరికొందరి వాదన. చెప్పే వాళ్లు ఏమైనా చెప్తారు అని అనుకుంటారు మరికొందరు.. కానీ ప్రమాదంలో ఉన్న అమ్మాయి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే.. దానికి పోలీసుల సత్వర స్పందన ఉంటే.. బాధితురాలిని రక్షించవచ్చని తాజాగా జరిగిన ఓ ఘటన ద్వారా నిరూపితమైంది.
ఆనాడు దిశ అలా..
రాత్రి సమయం.. ఊరి చివర.. బైక్ చూస్తే పంచర్.. చుట్లూ ఉన్న వాళ్లు సహాయం చేస్తామనే సరికి నమ్మేసింది. కానీ లోలోపల భయపడుతూనే ఉంది దిశ. అందుకోసమే.. తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతూ సమయాన్ని గడుపుదాం అనుకుంది. బెక్ బాగవగానే వెళ్లిపోవచ్చులే అనుకుంది. కానీ రాబోవు ప్రమాదాన్ని గ్రహించలేకపోయింది. కామాంధుల కాటుకు బలైంది. ఆనాడు దిశ చేసిన చిన్న పొరపాటు ఖరీదు.. తన ప్రాణం. ఇంటికి లేదా పోలీసులకు సమాచారం అందించగలిగే సమయం ఉంది. కానీ, ఏమవుతుందిలే అన్న చిన్న నిర్లక్ష్యం తన ప్రాణాల మీదకు తెచ్చింది.
కుటుంబ సభ్యులు స్పందించి పోలీసులకు విషయం చెప్పినా.. వారు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వారు సకాలంలో స్పందించి ఉంటే.. కథ మరోలా ఉండేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దిశ ఎక్కడ ఉందనే విషయం స్పష్టంగా తెలుసు. పోలీసులు సకాలంలో స్పందించి అక్కడి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి ఉంటే.. బహుశా దిశ ప్రాణాలతో దక్కేదేమో..
Must Read ;- లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు
నేటి యువతి ఇలా..
ఆనాడు దిశ అలా చేసుంటే బతికుండేది అనే మాటను నిజం చేసి చూపింది నేటి యువతి. ప్రమాదం ఎదురుకాగానే సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకుంది. బీఫార్మసీ చదువుతున్న యువతి.. సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఒక పాప, పెద్దావిడ ఉండడంతో భయం లేదులే అనుకుంది. కానీ, వారు మార్గమధ్యంలో దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత అందులో ఇద్దరు యువకులు ఎక్కారు. తను దిగాల్సిన స్టేజ్ వచ్చినా ఆటో ఆపకుండా వెళ్లిపోతుండడంతో.. యువతి అరవడానికి ప్రయత్నించింది. మార్గ మధ్యంలో ఆటోలో ఎక్కిన యువకులు ఆమె నోరు నొక్కి పెట్టి కొంత దూరం వెళ్లాక సిద్దంగా ఉంచిన వ్యానులో ఎక్కించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఆ యువతి తన తల్లికి ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసిన విషయాన్ని చేరవేసింది.
వెంటనే స్పందించిన తల్లిదండ్రులు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. వారు యువతి ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. వెంటనే పోలీసులు యాక్షన్ లోకి దిగడంతో.. కిడ్నాపర్లు యువతిని చెట్ల వద్దకు తీసుకెళ్లి.. కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. ఈలోగా పోలీస్ వ్యాన్ సైరన్ వినిపించడంతో.. ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. వెంటనే పోలీసులు ఆ యువతిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
దిశ కేసులో అప్పుడు అలా జరుగుంటే.. ఏం ఫలితాలు అందేవే.. ఇప్పుడు ఈ యువతి ఘటనతో కళ్లకు కట్టినట్లు తెలిసింది. ప్రమాదం ఎదురైనపుడు.. ఎలాంటి వారైనా భయపడడం సహజం, కానీ, మన చుట్టూ అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రమాదం నుంచి బయటపడచ్చని ఈ యువతి నిరూపించారు. ప్రమాద సమయంలో తనకు అందుబాటులో ఉన్న ఫోన్‌ను ఉపయోగించింది యువతి. వెంటనే తల్లికి సమాచారం అందించింది. తన పరిస్థితి వారికి తెలియజేసింది. ఇక్కడ యువతి సమయస్ఫూర్తి మాత్రమే కాదు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసుల యాక్షన్‌లోకి దిగితే..
తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు స్పందన ఇందులో ముఖ్య భూమిక పోషించిందని చెప్పచ్చు. వారు సకాలంలో యాక్షన్ లోకి దిగితే ఎలా ఉంటుందో చూపించారు. వారు స్పందించిన తీరు అభినందనీయం.. పోలీసులు సమయానికి స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యం.
ఈ ఘటనలో ఆ యువతి సమయస్ఫూర్తిని చూసి నేటి యువతులు నేర్పుకోవాలి. ప్రమాదం ఎప్పుడు, ఎటునుంచి ఎలా ఎదురవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తాజా ఘటనలో యువతి అందుబాటులో ఉన్న తన ఫోన్ ని ఉపయోగించింది. అలాగే, ప్రమాద సమయంలో ప్రతి యువతి తనకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచించాలి. మీ చేసే ఒక్క ఆలోచన.. మీ ప్రాణాలను నిలబెడుతుంది. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
Also Read ;- ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు