అధికార వైసీపీలో సొంత కుంపట్లు తీవ్ర స్థాయిలో రాజుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మొదలైన ఈ సొంత కుంపట్లు రానురాను మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో ఈ తరహా గొడవలు జరుగుతున్నా… రాయలసీమ ముఖద్వారంగా పేరు గాంచిన కర్నూలు జిల్లాలో ఈ గొడవలు ఏకంగా మంత్రులనే బెదిరించే స్థాయికి చేరిపోయాయి. తాజాగా బుధవారం నలుగురు మంత్రుల సమక్షంలో వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగేంత దాకా వెళ్లిపోయాయి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ కుమార్ వారించినా పెద్దగా లెక్క చేయని వైసీపీ కేడర్ ఏకంగా కుర్చీలు ఎత్తుకుని మరీ కొట్టుకునే దాకా వెళ్లాయి.
తమ అభ్యర్థులకు అవకాశం దక్కాలంటూ..
రాష్ట్రంలో వైసీపీకి ఇష్టం లేకపోయినా పంచాయతీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటికే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో గ్రూపులుగా విడిపోయిన వైసీపీ నేతలు… ఎన్నికల్లో తమ అభ్యర్థులకు అవకాశం దక్కాలంటే… కాదు తమ వర్గానికే దక్కాలంటూ వాదులాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి మంత్రి అనిల్ కుమార్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణలు బుధవారం కర్నూలు రాగా… స్థానిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు ఓ హోటల్‌లో సమావేశమై పార్టీ స్థితిగతులపై చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే అర్థర్, నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు తమ తమ అనుచర వర్గాలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మెజార్టీ సీట్లు కేటాయించాలని, వారందరినీ తాను ఏకగ్రీవంగా గెలిపించుకుంటానంటూ సిద్ధార్థరెడ్డి తన వాదనను వినిపించారు. అన్ని సీట్లను బైరెడ్డి వర్గానికే ఇచ్చేస్తే.. మరి తానేం చేయాలి? తన వర్గానికి న్యాయం ఎవరు చేస్తారంటూ ఎమ్మెల్యే అర్థర్ తన వాదనతో ముందుకొచ్చారు. ఇరువురు నేతలు ఒకింత సంయమనంగానే కనిపించినా… వారి వెంట వచ్చిన అనుచరులు మాత్రం ఈ రెండు మాటలకే సహనం కోల్పోయారు.
బైరెడ్డి మాటకే ఎదురు చెబుతారా? అంటూ సిద్ధార్థరెడ్డి వర్గానికి చెందిన ఓ సీనియర్ నేత ఎమ్మెల్యే అర్థర్‌పైకి అమాంతంగా లేచారు. ఇదే అదనుగా అర్థర్ వర్గంలోని ఓ సీనియర్ నేత కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి… ఎమ్మెల్యేగా ఉన్నది ఇతరులు చెప్పిన వారికి సీట్లు ఇచ్చేందుకేనా? అంటూ ఎదరు తిరిగారు. దీంతో కూర్చున్న కుర్చీలో నుంచి లేచిన సిద్దార్థరెడ్డి వర్గం నేత… అదే కుర్చీని లేపి అర్థర్ వర్గం నేతపై దాడికి దిగేందుకు యత్నించారు. వీరి మధ్య గొడవ ఏ స్థాయిదో తెలిసిన మంత్రి అనిల్ వెనువెంటనే మేల్కోని… సిద్ధార్థరెడ్డి వర్గం నేతను అడ్డుకున్నారు. ఇరువర్గాల నేతలంతా తక్షణమే వెనక్కు వెళ్లాలని అనిల్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అయితే జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా ఉన్న అనిల్ మాటను ఇరు వర్గాల నేతలు ఏమాత్రం పట్టించుకోలేదు. మంత్రి వారిస్తున్నా కూడా వినకుండా పరస్పరం బూతులతో దుర్భాషలాడుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన బొత్స, బుగ్గన, గుమ్మనూరులు కలుగజేసుకుని తమ కుర్చీల్లో నుంచి లేచి మరీ ఇరు వర్గాల మధ్యకు వచ్చి సర్ది చెప్పక తప్పలేదు. నలుగురు మంత్రులు చెబుతున్నా… వినకపోతే బాగుండదని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… అప్పటికప్పుడు వాదులాటను వదిలేసిన ఇరు వర్గాలు అక్కడి నుంచి నిష్క్రమించాయి.
Must Read ;- టార్గెట్ 90% : మంత్రుల గుండెళ్లో రైళ్లు!