ఏపీలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఎంపీలు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతోపాటు..ఏపీలో ఆలయాలపై దాడులు, ఫాస్టర్ ప్రవీణ్ వ్యవహారం, శాసన మండలి రద్దు, ఎన్నికల సంఘంతో వివాదం, అచ్చెన్నాయుడి అరెస్టు, పట్టాభిపై దాడి, మతమార్పిడుల వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. తొలుత ప్రకటించిన సమయానికి అత్యవసర సమావేశం ఉండడంతో కేంద్ర హోం మంత్రితో టీడీపీ ఎంపీల భేటీ కాస్త ఆలస్యమైంది. ఇక బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రలు ఉన్నారు.
ఏపీలో జరుగుతున్నవి వివరించాం: ఎంపీ కనకమేడల
అమిత్ షాను కలిసిన అనంతరం ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్నపరిణామాలను వివరించామన్నారు. నిమ్మాడ వ్యవహారంలో వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అరాచకాలు చేసినా పట్టించుకోకుండా, కుటుంబసభ్యుడితో రాజీ కోసం యత్నించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై 307 కేసు పెట్టి జైల్లో పెట్టడాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారిని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నవారిని, మీడియాను, సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని వేధిస్తున్న తీరుపైనా ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ సంస్థలను పనిచేయ నీయడం లేదని, గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘంతో వివాదాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. వీడియోలతో సహా మంత్రికి ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఇప్పటి వరకు ఆయన పాలనపై సీఎం జగన్ ఏకపక్ష సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపామన్నారు. ఆస్తుల విధ్వంసం, ఆలయాలపై దాడుల అంశాన్ని కూడా ప్రస్తావించామన్నారు. దీనిపై అమిత్ షా.. తాము ఇలాంటివి సహించేది లేదనే రీతిలో స్పందించారని కనకమేడల వ్యాఖ్యానించారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఏపీలో భూ కుంభకోణాలు, ఫాస్టర్ ప్రవీణ్ అంశం, అమరావతి రైతుల దీక్షలు, మీడియా గొంతు నొక్కేయడం తదితర అంశాలపై ఆధారాలు ఇచ్చామన్నారు. ఏపీలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. ఒక్క క్రైస్తవుడు కూడా లేని గ్రామాల్లోనూ చర్చిల నిర్మాణం జరుగుతోందని, వీటి వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని, అధికార వైసీపీ ఉందని భావించాల్సి ఉంటుందన్నారు. ఆలయాల ధ్వంసం, మతమార్పిడి అంశాలతో పాటు పాస్టర్ ప్రవీణ్ వీడియోని కూడా తాము కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై మరింత అదనపు సమాచారాన్ని తన కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా అమిత్ షా సూచించారన్నారు. ప్రధానంగా శాంతి భద్రతల విషయాన్ని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడితోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులను ప్రస్తావించినట్లు గల్లా జయదేవ్ చెప్పారు. న్యాయవ్యవస్థపై దాడుల విషయంపైనా ఫిర్యాదు చేశామన్నారు. న్యాయవ్యవస్థపై దాడులు చేస్తే.. గౌరవ న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పకుండా చూడొచ్చనే కుట్ర ఇందులో ఉందని, ఇలాంటి కుట్రలను అడ్డుకోవాలని కోరినట్టు గల్లా జయదేవ్ చెప్పారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని, వీటిని పరిశీలిస్తానని చెప్పారని టీడీపీ ఎంపీలు మీడియాకు చెప్పారు.
Must Read ;- విగ్రహాల ధ్వంసం కేసులు.. కేంద్రం ఏడాదిగా నిర్లక్ష్యం!