స్థానిక ఎన్నికల్లో 90 శాతం పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని లేదంటే మంత్రి పదవికే ముప్పు వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అమాత్యులకు టార్గెట్ పెట్టారు. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోయింది. అసలే మంత్రుల పదవీ కాలం రెండున్నరేళ్లేనని ముందే సీఎం ప్రకటించారు. అంటే 30 నెలల తరవాత వారి పనితీరు ఆధారంగా కొందరిని తొలగించి, మరికొందరికి అవకాశం కల్పిస్తారనేది స్పష్టం. దానికితోడు, మంత్రులకు స్థానిక ఎన్నికల గండం కూడా పొంచి ఉంది.
పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం వైసీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మంత్రులకే అప్పగించారు. అనుకున్న ఫలితాలు సాధించకుంటే మంత్రి పదవి ఊడిపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. వైఎస్ హయాంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో జడ్పీటీసీలు ఓటమి పాలయినందుకు అప్పటి మంత్రులు మూలింటి మారెప్ప, మాగంటి బాబులను పదవుల నుంచి తప్పించారు. అదే సీన్ మరలా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోయిందని తెలుస్తోంది. అందుకే అన్నీ పనులు పక్కనబెట్టి కేవలం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించడమే లక్ష్యంగా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
గత ఏడాది అలా.. ఇప్పుడు ఇలా..
గత ఏడాది ప్రారంభంలో స్థానిక ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం ద్వారా 24 శాతం స్థానాలు ఏకగ్రీవం చేసుకోగలిగారు. నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఏకగ్రీవాలు స్థాయిని మించి ఉంటే ఎన్నికను రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో అధికారపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతింటుంది. ఈ ప్రభావం తరవాత జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పంచాయతీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. సాధ్యమైనన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా పెద్దగా ఫలితం కనిపించ లేదు. మొదటి, రెండో దశల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏకగ్రీవాలు 3 శాతం మించేలా లేవని తెలుస్తోంది. ఎన్నికలను ఎదుర్కోవడం తప్ప అధికార పార్టీకి మరో గత్యంతరం లేకుండా పోయింది.
Must Read ;- పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దురాగతాలు..
ఎమ్మెల్యేలకూ టార్గెట్లు
కేవలం మంత్రులకే కాకుండా నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకూ పంచాయతీ ఎన్నికల పరీక్ష తప్పడం లేదు. వారి నియోజకవర్గంలో 90 శాతం గ్రామాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలింపించుకునే బాధ్యత వారి భుజాలపై వేశారు. ఏమాత్రం ఫలితాలు తారుమారైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు దక్కడం కష్టమేననే సంకేతాలను పార్టీ అధినేత పంపించారని తెలుస్తోంది. అందుకే మంత్రులతోపాటు, ఎమ్మెల్యేలకూ భయం పట్టుకుంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. ఏకగ్రీవాలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక మందు పారించడంతోపాటు, డబ్బు వెదజల్లేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జులకు కూడా టార్గెట్లు తప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో సీటు కావాలంటే వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ ముఖ్యుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయని తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు పంచాయతీ పోరులో తలమునకలైపోయారు.
నయానో భయానో..
పంచాయతీ ఎన్నికల్లో ఏదొకటి చేసి 90 శాతం గ్రామాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు నానాపాట్లు పడుతున్నారు. ముందుగా ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ బలపరిచిన అభ్యర్థి తప్ప మరెవరూ నామినేషన్లు వేయకుండా చూడటం, అది సాధ్యంకాకపోతే బెదిరించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బెదిరించడం, వారి వ్యాపారాలపై దెబ్బకొట్టడం వంటి అంశాలతో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, ఇక అది కూడా పనిచేయకపోతే ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి, మద్యం పారించడం వంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో వాలంటీర్లను కూడా రంగంలోకి దింపారని తెలుస్తోంది. వైసీపీకి ఓటు వేయకపోతే పింఛను, రేషన్ కట్ చేసేస్తామనే బెదిరింపులకు దిగుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో నెగ్గేందుకు అన్ని అవకాశాలను వైసీపీ నేతలు ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఫలితాలు వారు ఆశించిన విధంగా ఉండకపోవచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read ;- ఏకగ్రీవాలు స్థాయిదాటితే అధికారులదే బాధ్యత