విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఒక వర్గం నేతలు ఫ్లెక్సీలు కట్టారు. అయితే, తమ ప్రాంతంలో సీఎం ఫ్లెక్సీలు కట్టడానికి మీరెవరంటూ దేవినేని అవినాష్ వర్గం ఫ్లెక్సీలను చింపివేయడంతో రగడ మొదలైంది. ఇరువర్గాలు ఫ్లెక్సీలు చించుకుని కేసులు పెట్టుకున్నారు. విషయం వైసీపీ అధిష్ఠానానికి చేరడంతో ఇరువర్గాలకు క్లాస్ పీకారని తెలుస్తోంది. దీంతో విజయవాడలో ఫ్లెక్సీల గొడవ సర్ధుమణిగింది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వైసీపీలో రెండు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే మండేలా ఉంది. ఓవైపు యలమంచిలి రవి వర్గం, మరో వైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవినాష్ వర్గాలుగా విడిపోయారు. అయితే, ఎవరి ప్రాంతంలో వారు ఫ్లెక్సీలు కట్టుకోకుండా ఒకరికి పట్టున్న ప్రాంతంలోకి మరొకరు వెళ్లి ఫ్లెక్సీలు కట్టడంతో గొడవ మొదలైందని తెలుస్తోంది. యలమంచిలి రవికి అనుచరులుగా ఉంటున్న వైసీపీ నాయకులు నిమ్మల జ్యోతిక, కుప్పల కుమారీలు కట్టించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను దేవినేని అవినాష్ చింపించి వేయడం గొడవకు కారణం అయింది.