మొదటి నుంచి కూడా చరణ్ హడావిడిపడిపోతూ సినిమాలు చేసిన సందర్భాలు లేవు .. నిజం చెప్పాలంటే అంత అవసరం కూడా ఆయనకు లేదు. అయితే చరణ్ నిర్మాతగా కూడా మారిన తరువాత ఆయన సినిమాల మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే టాక్ ఇటీవల వినిపిస్తోంది. కానీ ఆయన ఒప్పుకుంటున్న ప్రాజెక్టులను చూస్తే, భారీ సినిమాలను మాత్రమే ఆయన అంగీకరిస్తున్నాడనే విషయం అర్థమవుతోంది. తాజాగా శంకర్ సినిమాను చేయనున్నట్టుగా వచ్చిన ప్రకటనే అందుకు నిలువెత్తు నిదర్శనం.
శంకర్ ఎలాంటి దర్శకుడో .. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. భారీ సినిమాలు .. భారీ విజయాలు ఆయన ఖాతాలో చాలానే కనిపిస్తాయి. శంకర్ దర్శకత్వంలో చేయాలనే ఆశ .. ఆసక్తి చాలామంది స్టార్ హీరోలకు ఉంటుంది. అయితే ఏ కొద్ది మందికో ఆ కోరిక నెరవేరింది. మిగతా వాళ్లంతా తమవంతు ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే లక్కీగా చరణ్ తో శంకర్ సినిమా సెట్ అయింది. ఇప్పటివరకూ ఒక రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన ‘దిల్’ రాజు, ఈ సినిమాతో సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.
ఇప్పుడు అంతా ఈ ప్రాజెక్టును గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనేది వాళ్ల చర్చల్లో ప్రధానమైన అంశంగా మారిపోయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. కానీ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ తో పని ఉండదు గనుక, అనుకున్న సమయానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ‘దిల్’ రాజు చెప్పిన బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తిచేయడానికి అంగీకరించిన శంకర్, ఆల్రెడీ రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు.
Must Read ;- శంకర్ చరణ్ మూవీలో విలన్ గా స్టార్ హీరో!











