ఇప్పుడు టాలీవుడ్లో శంకర్ – చరణ్ కాంబినేషన్ సెట్ కావడం గురించిన హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, అంతా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్‘ తరువాత టాలీవుడ్ దర్శకులతోనే చరణ్ తదుపరి సినిమా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆయన తమిళ దర్శకుడైన శంకర్ ను సెట్ చేసుకోవడం అందరినీ ఆనందాశ్చర్యాలకు గురిచేసింది.
చరణ్ తన 15వ సినిమానే శంకర్ తో చేసే అవకాశం కలగడం ఆయన అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇక శంకర్ దర్శకత్వంలో చేయాలని కోరుకున్న చిరంజీవి, ఆ అవకాశం ముందుగా చరణ్ కి దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఒక స్టార్ హీరో కనిపించనున్నాడని అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరనేదే ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది.
శంకర్ సినిమా అనగానే .. అది పాన్ ఇండియా సినిమా అనే అర్థం చేసుకోవాలి. చాలాకాలంగా ఆయన పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. అలాగే ఈ కథను కూడా ఆయన పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేశాడట. వివిధ భాషల్లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది కనుక, ఆయా భాషల్లో మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్టులను ఆయన తీసుకోనున్నాడు. అందులో భాగంగానే విలన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరోను సెట్ చేసే ప్రయత్నాల్లో శంకర్ ఉన్నాడట. ఈ భారీ సినిమాలో చరణ్ జోడీ కట్టనున్నది ఎవరనేది కూడా అభిమానులలో ఉత్కంఠను రేపుతోంది.
Must Read ;-పుష్ప సెట్లో చెలరేగుతున్న చరణ్