లాక్ డౌన్ తరువాత థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. అభిమానుల్లో మళ్లీ మునుపటి ఉత్సాహం కనిపిస్తోంది. లాక్ డౌన్ తరువాత కంటెంట్ ఉన్న సినిమాలు రావడం కూడా అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలా వచ్చిన ‘ఉప్పెన’ సినిమా యూత్ కు ఒకరేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిన్న రాత్రి ‘రాజమండ్రి’ .. మార్గాన్ని ఎస్టేట్స్ గ్రౌండులో నిర్వహిచారు. చరణ్ ముఖ్య అతిథిగా ఈ వేడుక కొనసాగింది.
ఈ సందర్భంగా స్టేజ్ పై కృతి శెట్టి కనిపించగానే అభిమానులు పెద్దఎత్తున సందడి చేశారు. తెరపై ఆమె ఎంత అందంగా కనిపించిందో .. స్టేజ్ పై కూడా అలాగే ఉండటంతో, అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. ఆమె అచ్చ తెలుగులో మాట్లాడుతుంటే విజిల్స్ కొట్టారు. మొదటి మూడు ముక్కలు తెలుగులో మాట్లాడి ఆ తరువాత ఇంగ్లిష్ లో వాయించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె తెలుగును స్పష్టంగా మాట్లాడటంతో, ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె ఇండస్ట్రీలో ఉన్నంతవరకూ ఆమె అభిమానులుగానే ఉండాలని ఫిక్స్ అయ్యారు.
కృతి శెట్టి మాట్లాడుతూ .. “మీ అందరి సపోర్ట్ వల్లనే ‘ఉప్పెన’ ఇంతటి సక్సెస్ అయింది. ‘బేబమ్మ’పాత్రను మీరు ఆదరించిన తీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. సుకుమార్ సార్ ఒక లైట్ హౌస్ లా దారి చూపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. బుచ్చుబాబుగారి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించడం గర్వంగా ఉంది. విజయ్ సేతుపతిగారి నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు ఇంకా మాట్లాడాలని ఉంది .. కానీ స్టేజ్ పై చరణ్ గారు ఉండటంతో చాలా నెర్వస్ గా ఉంది. నేను ఆయనకి వీరాభిమానిని. ఆయన వచ్చిన దగ్గర నుంచి నాకు స్టేజ్ పై ఆయన తప్ప ఎవరూ కనిపించడం లేదు” అంటూ మెగా అభిమానుల మనసులను దోచేసింది.
Must Read ;- చరణ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న ఉప్పెన దర్శకుడు











