ఏ హీరోకి ఎప్పుడు సూపర్ హిట్టు వస్తుందో తెలియదు. కానీ మరీ ఎగ్జైట్ అయిపోయేంత విజయం దక్కినప్పుడు మాత్రం.. ఆ సంతోషాన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చి మరీ వ్యక్తం చేస్తూండడం.. అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైంది. ఇదివరకు యన్టీఆర్, సూర్య లాంటి హీరోలు తమకు మంచి హిట్టిచ్చిన దర్శకులకు కారో , ఫ్లాటో బహుమతిగా ఇచ్చారు. అలాగే ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్టయినందుకు .. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేక దర్శకుడు కొరటాల శివకి ..మహేశ్ బాబు ఆడి కారు గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.
బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ‘రాక్షసుడు’ సూపర్ హిట్టైన సందర్బంగా.. దర్శకుడు రమేష్ వర్మకి ఖరీదైన ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడు. ఇక ‘మహానటి’ మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా కథానాయిక కీర్తి సురేశ్ .. చిత్ర యూనిటిలోని ప్రతీ ఒక్కరికీ బంగారు నాణాలు పంచిపెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తరచుగా కొరియోగ్రాఫర్స్ కి , దర్శకులకి ఖరీదైన వాచెస్ ను , రింగ్స్ ను బహుమతిగా ఇస్తూంటారు.
దర్శకుడు మారుతికి ‘ప్రతిరోజూ పండగే’సినిమా సూపర్ హిట్టయిన సందర్భంగా.. నిర్మాత ఓ ఖరీదైన కారు ప్రెజెంట్ చేశాడు.
అలాగే ‘ఛలో’ సినిమా సూపర్ హిట్టయితే.. దర్శకుడు వెంకీ కుడుములకి నాగశౌర్య కారు బహుమతిగా ఇచ్చాడు. ఇక ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. తన వ్యక్తిగత ట్రైనర్ కు 65 నుంచి 70 లక్షల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇవ్వడం.. దానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని మరిచిపోకముందే ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా ఓ దర్శకుడికి ఖరీదైన కారు ప్రెజెంట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘భీష్మ’ సినిమాతో నితిన్ కు సూపర్ హిట్టిచ్చిన వెంకీ కుడుముల.
‘అ,ఆ’ తర్వాత గాడి తప్పిన నితిన్ కెరీర్ ను .. ‘భీష్మ’ చిత్రం తిరిగి ట్రాక్ లో పెట్టింది. అందుకే వెంకీ కుడుములకి నితిన్.. రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. రెండేళ్ళు తన కోసం శ్రమించిన వెంకీ కుడుములకి ఆ రేంజ్ లో గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. అయితే ఇందులో విశేషమేంటంటే.. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సినిమాలు రెండే. అందులో ఒకటి ‘ఛలో’, రెండోది ‘భీష్మ’. ఛలో సూపర్ హిట్టయిన సందర్భంగా నాగశౌర్య నుంచి కారు గిఫ్ట్ గా పొందిన వెంకీ..
ఇప్పుడు మళ్ళీ భీష్మ సూపర్ హిట్టైన సందర్భాన్ని పురస్కరించుకొని .. నితిన్ నుంచి కూడా కార్ బహుమతిగా పొందడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంటే. కేవలం రెండే రెండు సినిమాల హిట్స్ తో రెండు ఖరీదైన కార్లు బహుమతిగా పొందడం ..ఇంతవరకూ ఏ దర్శకుడికీ సాధ్యం కాలేదని వెంకీ కుడుముల గురించి ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు. ఓరి మీ గిఫ్ట్ లు బంగారం కానూ..