పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. రేపు ఎన్నికలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని ధర్మాసనం తీర్పునిచ్చింది. రేపు నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యథాతధస్థితి కొనసాగించాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే పిటీషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే రేపు కోర్టు తీసే సమయానికే ఓటింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఎన్నికలు యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, అక్కడ వచ్చే తీర్పును బట్టి ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగు వారాలు అవసరం లేదు
నోటిఫికేషన్ తరవాత నాలుగు వారాలు కోడ్ అమల్లో ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది గరిష్ఠ వ్యవధి అని కనీసం ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలనేది కాదని ఎస్ ఈ సీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దీంతో రేపు పరిషత్ ఎన్నికలు సజావుగా జరుపుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే కోర్టు తుది ఆదేశాలు వెలువరించే వరకు ఫలితాలు ప్రకటించవద్దని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. రేపు 8వ తేదీన ప్రతి పౌరుడూ తమ ఓటుహక్కు ను ఉపయోగించుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కమీషన్ తరపున న్యాయవాది సి.వి.మోహాన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యంలు డివిజన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు.
Must Read ;- నిలిచిన చోట నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ఎస్ఈసీ











