కాంగ్రెస్… భారత స్వాతంత్రానికి ముందు ఎందరో మహనీయుల చేతుల మీదగా పురుడు పోసుకున్న పార్టీ. ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి దోహదపడి, భారతీయ చిహ్నంగా నిలిచిన పార్టీ. అంతటి ప్రభ కలిగిన పార్టీ, నేడు దయనీయ స్థితికి చేరుకుందనేది ఎవరూ కాదనలేని నిజం. మళ్లీ తిరిగి వైభవాన్ని సంతరించుకుంటుందా అనేది సమాధానం లేని ప్రశ్న అనే చెప్పాలి. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో సైతం గెలుపు గుర్రాన్ని అందుకోవాలని సాయశక్తులా ప్రయత్నించింది. కానీ 19 సీట్లతో సరిపుచ్చుకోవాల్సిన స్థితికి చేకూరుతుంది. అంతర్మథనం చేసుకుని ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కోనకపోతే 100 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు.
తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి?
బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఆర్‌జెడితో జట్టుకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. బిహార్ ఎన్నికల విజయంతో దేశ రాజకీయాల్లో తిరిగి తమ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని ఆశించిన కాంగ్రెస్‌కు నిరాశే మిగిలిందని చెప్పాలి. 144 సీట్లలో పోటి చేసిన ఆర్ జెడి 75 సీట్లు గెలిచి కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీగా నిలిచింది. ఎక్కడుందీ లోపం? కాంగ్రెస్ ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? మేనిఫెస్టో నుండి ప్రచారం వరకు ఎంతో పగడ్బందీగా నిర్వహించినా కాంగ్రెస్ అపజయానికి కారణాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికి సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయం.
Must Read: నేడు బిహార్ శాసనసభ తొలి విడత ఎన్నికలు
వారసత్వమే శాపమా
మన భారత దేశంలో వారసత్వ రాజకీయాలు కొత్తేమీ కాదు. రాష్ట్ర పార్టీల నుండి జాతీయ పార్టీల వరకు తమ వారసులను రాజకీయాల్లో పోటీ చేయించడం సాధారణమైన విషయమే. నెహ్రూతో మొదలైన కాంగ్రెస్ అసలైన రాజకీయం.. ఆయన వారసురాలిగా ఇందిరా గాంధి చేపట్టారు. ఆమె తెగువ, పాలన ప్రపంచ విధితం. వారసురాలైనా… సమర్థురాలు అనిపించుకున్నారు. ఆమె వారసురుడిగా రాజీవ్ గాంధి రాజకీయ అరంగేట్రం చేసి, ఇండియాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయడంతో పాటు, కుంభకోణాలను అందించారు. ఇక ఆపై సోనియా, ఆ తర్వాత రాహుల్… ఇలా అప్రతిహతంగా వారసత్వాన్ని కొనసాగించడం కూడా ప్రమాదకరమని కాంగ్రెస్‌ను చూస్తే తెలుస్తుంది.
సీనియర్ల విసుర్లు
ప్రస్తుత పరిస్థితిని గమనించిన సీనియర్లు, తమ అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేస్తున్నారు. గతంలో లేఖ రూపంలో తమ సమస్యలను వివరించిన సీనియర్లు, నేడు బిహార్ ఎన్నికల ఫలితాలు అనంతరం బహిరంగంగానే విమర్శించడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్, కాంగ్రెస్‌ను ప్రజలు అసలు ప్రత్యామ్నాయ పార్టీగానే భావించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ స్థితిని బహిర్గతం చేశాయి. అంతేకాదు, పార్టీలోని అధిష్టానానికి సమస్యలు, సమాధానాలు రెండు తెలుసని, కానీ వాటిని గుర్తించి పరిష్కరించడానికి సిద్ధపడడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రక్షాళన అవసరం
ఎంతటి పార్టీకైనా గడ్డు కాలం రావడం అనేది సహజం. కానీ, ఆ సమయంలో చేయాల్సిన మార్పులను చేపట్టకపోతే పార్టీ కనుమరుగవడం ఖాయం. ఇకనైనా పార్టీ మునుపటిలా వైభవం అందుకోవాలని భావిస్తే లోపాల్ని గుర్తించి, సరిదిద్దుకోక తప్పదు. అందులో ముందుగా వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి విలువనివ్వాలి. సీనియర్ల సలహాలను అందుకుంటూ, యువతకు రాజకీయ బరిలో అవకాశాన్ని కల్పించాలి. పార్టీ నిర్ణయాత్మక పదవుల్లో యువతకు అవకాశం కల్పించి వారు బలపడడానికి దోహద పడాలి. ఇలా మెలకువలు కలిగిన వారిని గుర్తించడంలో విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఒక వారసత్వ పార్టీ అనే ముద్ర నుండి బయటపడడంతోపాటు.. అందరినీ గుర్తించి అవకాశం కల్పిస్తుందనే పేరు తెచ్చుకుంటుంది.
Also Read: నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లకు రాజకీయ గ్రహణం…!