నంద్యాలలో ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం, భార్య, ఇద్దరు పిల్లల సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణమైన దుర్ఘటన. మరణానికి పురిగొల్పేంత ఆర్థిక ఇబ్బందులు లేవు. మరి కుటుంబం మొత్తం కట్టగట్టుకుని చావు మాత్రమే పరిష్కారంగా ఎంచుకున్నారంటే.. అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? అనే సందేహం ఎవ్వరికైనా వస్తుంది. ఇది కేవలం పోలీసు పాపం. అయితే దురదృష్టవశాత్తూ రాజకీయ రంగు పులమడం ఎక్కువగా జరుగుతోంది.
జరిగిందేమిటి?
అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆటోడ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఏడాది కిందట నిమిషాంబ జ్యువెలర్స్ లో గుమాస్తాగా పనిచేశాడు. అప్పట్లో నగల దుకాణంలో చోరీ జరిగింది. ఈకేసులో అబ్దుల్ సలాంను కూడా విచారించారు. అతని ఇంట్లోంచి 47 తులాల బంగారం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజానికి దుకాణంలో చోరీ అయిన నగల డిజైన్లకు, సలాం ఇంట్లోని నగలకు పోలికలు లేవు. కానీ.. స్వాధీనం మాత్రం జరిగింది. అప్పట్లో అతణ్ని అరెస్టు చేశారు. బెయిలుపై బయటకు వచ్చాడు. సహజంగానే ఉద్యోగం పోయింది. అప్పటినుంచి ఆటోడ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
ఇదంతా పూర్వరంగం. తాజాగా సలాం ఆటోలో ప్రయాణించిన ఒక వ్యక్తికి చెందిన రూ.70 వేల సొమ్ము పోయింది. అతను పోలీసు కంప్లయింటు ఇచ్చాక సలాంను పిలిచి విచారించారు. కంప్లయింటు ఇచ్చిన వ్యక్తి ఆటో ఎక్కిన సంగతి సీసీ ఫుటేజీల ద్వారా ధ్రువపడింది. పోలీసుల దాకా సలాం వచ్చేసరికి.. నగల దుకాణం చోరీకి సంబంధించి పోలీసులు ఒత్తిడి పెంచారు. తాజాగా డబ్బు పోయిన సంగతి మరుగున పడింది. సలాంసహా, భార్యను కూడి పిలిపించి పోలీసులు తీవ్రమైన పదజాలంతో దూషించినట్లుగా సలాం అత్త మాబున్నీసా చెబుతోంది. నగల దుకాణం చోరీ విషయంలోనే పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారు.
సలాం భార్యను, కూతురిని ప్రస్తావిస్తూ.. చాలా అసభ్యంగా కూడా పోలీసులు మాట్లాడినట్లు సలాం అత్త చెబుతోంది. నగల దుకాణం చోరీకి సంబంధించి.. తన స్వార్జితమైన ఇంట్లోని బంగారం మొత్తాన్ని పోలీసులే సీజ్ చేసేసి.. ఇంకా అదే కేసులో దోషిగా చూపించడానికి వేధిస్తున్నారనే బాధ సలాంకు ఉందని తెలుస్తోంది. అదే సమయంలో.. భార్య, కూతురి ని కలిపి పోలీసులు వేసిన నిందలు, చేసిన బెదిరింపులు సలాంను బాగా కుంగదీశాయని తెలుస్తోంది. ఎంతకాలం గడిచినా పోలీసులు తనని విడిచిపెట్టరని, ఆ క్షోభతోనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. AlsoRead ;- రాజకీయ కోణం ఉంటే.. హత్యాచారాన్ని తొక్కేస్తారా?
పోలీసు అత్యుత్సాహం..
ఇప్పటికి దాకా బయటకు వచ్చిన వివరాలను బట్టి.. నగల చోరీ కేసులో సలాంను దోషిగా నిరూపించేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు కనిపిస్తుంది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న సలాం.. ప్రతినెలా పోలీసుస్టేషన్ కు హాజరవుతూనే ఉన్నాడు. డబ్బు కోల్పోయిన కేసులో ఆటో డ్రైవరుగా సలాం రావడం.. వారికి కలిసొచ్చింది. మరింతగా అతణ్ని ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. సంబంధం లేని కేసులో బట్టలు విప్పించి మరీ కొట్టారని అతని అత్త చెబుతోంది. ఇదంతా భార్య ఎదుటే జరిగిందని కూడా అంటోంది.
అసలు ఆటోలో నగలు పోవడం అనే వ్యవహారంలో భార్యను పోలీసు స్టేషన్‌కు పిలిచే అవసరం ఏంటనేది కూడా అంతుచిక్కని సంగతి. మొత్తానికి అబ్దుల సలాం కుటుంబం కడతేరిపోయింది. సీఐ బెదిరింపుల వల్లనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బయటకు వచ్చిన సెల్ఫీ వీడియో.. సంచలనంగా మారింది. ఆ వీడియోలోని ఆరోపణలన్నీ ప్రధానంగా సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ల మీదనే ఉన్నాయి.
AlsoRead ;- 139 మంది అత్యాచారాల్ని మలుపు తిప్పిన డాలర్ భాయ్
సీఐపై మరొకరు కక్ష కట్టారా?
దీనికి సమాంతరంగా కొన్నాళ్లుగా జరిగిన కొన్ని ఘటనలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాయని అనిపిస్తోంది. సుమారు రెండు నెలల కిందట- జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ నాయకుడు ఒకరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు చిక్కారు. ఇదే సీఐ సోమశేఖర్ రెడ్డి అతడిని విచారించినప్పుడు, సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. సీఐ కాలర్ పట్టుకుని బెదిరించాడు. ఈ వ్యవహారంలో సదరు మైనారిటీ సెల్ నాయకుడిని సీఐ స్టేషన్‌కు తీసుకెళ్లడమూ.. రాజకీయ ఒత్తిళ్లతో రెండోరోజున విడిచిపెట్టడమూ జరిగింది.
తాజా దుర్ఘటన విషయంలో- సదరు మైనారిటీసెల్ నాయకుడి పాత్ర కూడా ఉంది. ఆత్మహత్యకు ముందు సలాం విడుదల చేసిన సెల్ఫీ వీడియో తొలుతే ఆ నాయకుడికి దక్కింది. అప్పటికే సీఐ మీద ఆగ్రహంతో రగిలిపోతున్న సదరు నాయకుడు ఆ వీడియోను వైరల్ చేసినట్లుగా కూడా వినిపిస్తోంది. సీఐను ఇరికిస్తున్నట్టు అనుకున్నారే తప్ప.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుందని అతను ఊహించలేదని అంటున్నారు.
మొత్తానికి సీఐ, కానిస్టేబుల్ మీద ఆరోపణలు మిన్నంటాయి. వారిద్దరినీ సస్పెండ్ చేసి, అరెస్టు చేశారు. ఆ వెంటనే వారికి బెయిల్ లభించింది. బెయిల్ కు వీల్లేని సెక్షన్లు పెట్టారంటూ ఒక రాద్ధాంతం జరుగుతోంది.
AlsoRead ;- నాకు ప్రాణహాని ఉంది : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు
రాజకీయ రంగు పులుముకుంది ఇలా..
అరెస్టు అయిన సీఐ పేరు సోమశేఖర్ రెడ్డి. పేరులో రెడ్డి ఉన్నప్పటికీ.. అతను బలిజ కులానికి చెందిన వ్యక్తి. అయితే పేరులో రెడ్డి ఉండగానే.. అతను వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇష్టుడని, అతణ్ని కాపాడ్డానికి తేలికపాటి సెక్షన్ల కింద కేసులు పెట్టారని సోషల్ మీడియా హోరెత్తి పోయింది. ఈలోగా అతడికి బెయిల్ ఇప్పించిన లాయరు రామచంద్రరావు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కావడంతో ఆరోపణలు అటునుంచి ఇటు తెలుగుదేశం మీదికి మళ్లాయి.
అబ్దుల్ సలాం ఆత్మహత్య నేపథ్యంలో.. ముస్లిం వర్గాల్లో తన ప్రభుత్వం మీద దురభిప్రాయం ఏర్పడుతుందని భయపడ్డారో ఏమోగానీ.. సీఎం జగన్ స్వయంగా రంగంలోకి వచ్చారు. అప్పటికే సలాం కుటుంబానికి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయల సాయం ప్రకటించింది. జగన్ ముస్లిం వస్త్రధారణలో ప్రెస్ మీట్ పెట్టి.. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐకు బెయిల్ ఇప్పించింది తెలుగుదేశం నాయకుడే అని.. అని తెలుగుదేశం మీదికి ఆరోపణలు గుప్పించారు.
ఈలోగా చంద్రబాబునాయుడు, సదరు లాయరు రామచంద్రరావును ఫోనులో మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ లాయరు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేయడంతో పాటు, ఈ కేసునుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు తెరపైకి వచ్చారు. సీఐ మీద ఒత్తిళ్లు తెచ్చిన తెరవెనుక శక్తులు వైసీపీ నాయకులే అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సలాం ఆత్మహత్య- అందుకు దారి తీసిన పోలీసుల ఒత్తిడి, ఖాకీ పాపాలు ఇవన్నీ తెరవెనక్కుపోయాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిని మరొకరు బాధ్యులుగా నిరూపించడానికి, ప్రజల ఎదుట దోషులుగా నిలబెట్టడానికి తంటాలు పడుతున్నాయి. AlsoRead ;-సీఎం జగన్ ను కలవనున్న దివ్య తేజస్విని పేరెంట్స్
టీడీపీకి మరక ఎలా అంటుకున్నదంటే..
అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉంది. పోలీసుల మీద తెరవెనుకనుంచి ఏదైనా ఒత్తిళ్లు ఉంటే.. అవి సహజంగా వైసీపీ నేతలనుంచి ఉండే అవకాశం ఉంది. అలాంటివి కూడా ఇప్పటిదాకా స్పష్టంగా తేలకపోయినప్పటికీ.. మరక తెలుగుదేశానికి ఎలా అంటుకుంది? అనేది పెద్ద ప్రశ్న.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమచారాన్ని బట్టి.. అరెస్టు అయిన సీఐ సోమశేఖర రెడ్డి సోదరుడు అనంతపురంలో లాయరు. ఆయన ఈ కేసును స్వయంగా తీసుకోవచ్చు గానీ.. అప్పటికప్పుడు బెయిలు కోసం స్థానిక లాయరు అవసరం కావడంతో.. తన మిత్రుడైన రామచంద్రరావును సంప్రదించినట్టు తెలిసింది. దాంతో రామచంద్రరావు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ వచ్చేసింది. (రామచంద్రరావుకు తెలియకుండానే.. ఆయన జూనియర్ లాయర్లు బెయిల్ పిటిషన్ మూవ్ చేసినట్లుగా కూడా ఒక వాదన వినిపిస్తోంది). రామచంద్రరావు పిటిషన్ మూవ్ చేయడం, బెయిల్ మంజూరు కావడాన్ని వైసీపీ తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకుంది. దానివల్ల ఆయనకు పార్టీలో ఉన్న పదవి పోవడం తప్ప ఇంకేమీ సాధించినట్టు లేదు.
AlsoRead ;- జగన్ ను సీఎంగా తొలగించాలి… సుప్రీంకోర్టులో పిటీషన్!
కులం రంగు కూడా పులుముకుంది..
సీఐ సోమశేఖర్ రెడ్డి విషయంలో ముందు కులం రంగే తెరపైకి వచ్చింది. ఆయనను రెడ్డిగా భావించి కొందరు వైసీపీ రంగుపులిమే ప్రయత్నం చేశారు. ఈలోగా.. బలిజ కులం ప్రతినిధులంతా తెరపైకి వచ్చారు. బలిజ వాళ్లందరం ఏకం కావాలని.. సంబంధం లేని విషయంలో సోమశేఖర్ రెడ్డిని దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.. మనమంతా కలిసి దానిని అడ్డుకోవాలని.. టీడీపీ పదవి కోల్పోయిన లాయరు రామచంద్రరావుకు కూడా మద్దతివ్వాలని స్థానికంగా వాట్సప్ గ్రూపుల్లో మెసేజీలు విపరీతమైన ఫార్వార్డ్ లతో హల్ చల్ చేశాయి.
ఖాకీపాపం మరుగున పడింది..
ఏదైనా నేరాలకు సంబంధించిన కేసుల విషయంలో నిందితులను విచారించేప్పుడు పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించడం సహజం. కానీ అబ్దుల్ సలాం విషయంలో వారి దాష్టీకం శృతిమించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఏమాత్రం నిరూపించలేని ఆటోలో నగదుచోరీ తాజా కేసు అయితే.. ఏడాది కిందటి నగల చోరీ కేసుతో వేధించడం చిత్రమైన సంగతి. పైగా.. భార్య, కూతురు విషయంలో కూడా అసభ్యమైన బెదిరింపులకు దిగడం అనేది దుర్మార్గం.
ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. అంత తేలికపాటి కేసులు పెట్టడమే కాకుండా, చురుకైన దర్యాప్తు చేయకుండా.. పోలీసుల దాష్టీకాన్ని నిగ్గు తేల్చకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారనేది అర్థం కాని సంగతి.
AlsoRead ;- జగన్ స్వస్థలంలో వైసీపీ ముఠా కొట్లాటలు











