ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే చిత్రం గురించి సస్పెన్స్ వీడిపోయింది. ‘‘ప్రభాస్ ఇన్ అండ్ యాజ్… ఆదిపురుష్’’ అంటూ ఓం రౌత్ పోస్టరును తన ట్విటర్ లో రిలీజ్ చేసేశారు. ప్రభాస్ చాలా ఉత్సుకతగా ఎదురుచూసిన సినిమా అనౌన్స్‌మెంట్ ఇది. రామాయణ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నారు. అయితే ప్రతినాయకుడు అయిన రావణాసురుడు ఎవరు?
‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడిగా హృతిక్ రోషన్ నటించబోతున్నారు. సాధారణంగా సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ కావాలంటే.. ప్రతినాయకుడి పాత్ర కూడా ఎంతో బలంగా ఉండాలి. విలన్ ఎంత గట్టివాడైతే.. హీరో అంత గొప్పవాడిగా నిరూపణ అవుతుంది. మనం రామాయణ కథను గమనించినా అంతే. రావణాసురుడు అపరిమిత బలసంపన్నుడిగా అందులో వర్ణన ఉంటుంది.
మరి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తోంటే.. తనకు దీటుగా రావణాసురుడి పాత్రను మెప్పించగల వారెవ్వరు అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. ఈ పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ రోషన్ చేస్తున్నారు. ఫిట్‌నెస్ గురించి మంచి శ్రద్ధ పెడుతూండే హృతిక రోషన్ ను బాలీవుడ్ లో గ్రీక్ గాడ్ గా అభివర్ణిస్తుంటారు. భారీగా కండలు తిరిగి కనిపించే పాత్రలు గతంలో హృతిక్ ఎన్నో చేశారు. ఈ రావణబ్రహ్మ పాత్ర కూడా వాటిని తలదన్నేలా ఉంటుందని అనుకోవచ్చు.
నిజానికి బాహుబలి చిత్రంలో కూడా హీరోగా ప్రభాస్ ఎంత మెప్పించారరో.. విలన్ గా రానా కూడా.. అంతే గొప్పగా చేశారు. విలన్ పాత్రలో రానా అద్భుతమైన ప్రదర్శనే, ప్రభాస్ లోని హీరోయిజంను కూడా ఎలివేట్ చేసింది. ఇప్పుడు రానాను మించి.. హృతిక్ రోషన్ ‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడి పాత్రకు నప్పుతారనే అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ అదరగొడుతుందనడంలో సందేహం లేదు.
కాకపోతే రామాయణ కథలో అంతే ప్రధానమైన సీత, హనుమంతుడి పాత్రల్ని ఎవరు చేయబోతున్నారనేది ఇంకా సస్పెన్స్ వీడడం లేదు.