మానవ సంబంధాలకు కూడా ఒక పరిధి ఉంటుందా? అవి ఎక్స్ పైర్ అయితే పరిస్థితి ఏమిటి? అనేది నేటి సమాజంలో ప్రస్తుతం ఉన్న సమస్య. మన బంధాలు, అనుబంధాలు అన్నీ ఈ ఎక్స్పైరీ డేట్ తోనే ముడిపడి ఉంటాయి. ఇదే అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని ఓ వెబ్ సిరీస్ రూపొందింది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి ద్విభాషా వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’. కథానాయిక స్నేహా ఉల్లాల్ ఈ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఇంకా టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించారు.
దీనికి ఒకప్పటి ఎడిటర్ కేఏ మార్తాండ్ కుమారుడు శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 2 నుంచి జీ 5లో హిందీ వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదలైంది. ప్రేమ, అబద్ధం, మోసం అనేవి మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో దర్శకుడు ఇందులో చూపించారు. మొత్తం 5 కథలను 10 ఎపిసోడ్స్ గా అందించారు. దీని తెలుగు వెర్షన్ ఈ నెల 9న విడుదల చేశారు. దీని ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. డిసెంబరు 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో టోనీ లూక్ ఫిర్యాదు చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
తన భర్త కూడా కనిపించడం లేదని మరో మహిళ కూడా ఫిర్యాదు చేస్తుంది. ఆమె భర్త కూడా అదే పెళ్లికి వెళతాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందా అనే అనుమానం బయలుదేరుతుంది. కేవలం వివాహేతర సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ద్రోహం, మోసం అనే అంశాలతోనే ఈ కథ సాగుతుంది. చీకటి సంబంధాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఊహించని మలుపులతో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని దర్వకుడు శంకర్ మార్తాండ్ అంటున్నారు. స్నేహా ఉల్లాల్ మొదటి సారిగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. జీ5లో ఎక్స్ క్లూజివ్ గా దీన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.











