(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకు జిల్లాల పునర్విభజన చేపట్టొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం చాప కింద నీరులా ఈ ప్రక్రియ ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత ఏం క్షణానైనా జిల్లాల పునర్విభజన జరగవచ్చని, అందుకు సమాయత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
కొత్త ఐటీడీఏ భవనమే కలెక్టరేట్
జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఆవిర్భివించనున్న పార్వతీపురం జిల్లాకు అక్కడ కొత్తగా నిర్మించిన ఐటిడిఎ భవనాన్ని కలెక్టరేటుకు విజయనగరం జిల్లా అధికారులు ప్రతిపాదించారు. అలానే జిల్లా పునర్విభజనకు సంబంధించి ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కొంతవరకు జిల్లా అధికారులు పంపించారు. మరింత సమాచారం అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా భావిస్తున్నారు. అందుకు కీలకమైన కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సమాచారం పంపించారు.
కొనసాగుతున్న కసరత్తు
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజనకు చేపట్టిన కసరత్తు జిల్లాలోనూ కొనసాగుతోంది. దీనికోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు జిల్లాలో భౌగోళిక పరిస్థితులు, భవనాలు, సిబ్బంది, ఇతర వివరాలు సేకరిస్తున్నాయి.
రాష్ట్ర కమిటీలో ఒకరైన ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు .. పార్వతీపురం డివిజన్ కేంద్రంలో కీలకమైన కార్యాలయాలకు అవకాశం ఉన్న భవనాలను గుర్తించి ఇవ్వాలని సూచించారు. దీనిపై పార్వతీపురం సబ్ కలెక్టర్‌ను ప్రతిపాదనలు కోరారు. ఆయన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు సంబంధించి వివరాలు పంపించారు. కలెక్టరేట్‌కు ఐటీడీఏ కోసం కొత్తగా నిర్మిస్తున్న భవనం, ఎస్పీ కార్యాలయానికి ప్రస్తుత డీఎస్‌పీ కార్యాలయం, ప్రత్యామ్నాయంగా యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ), జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను సూచించారు. వాటి విస్తీర్ణం, అందులో భవనాల విస్తీర్ణం, ఖాళీగా ఉన్న స్థలం విస్తీర్ణం వివరాలు మ్యాప్‌లతో సహా నివేదించగా వాటిని కలెక్టర్ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపించారు.
భౌగోళిక పరిస్థితులపై ..
జిల్లాకు సంబంధించి బౌగోళిక పరిస్థితుల వివరాలు కూడా ఇక్కడి అధికారులు పంపించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో ప్రస్తుతం ఉన్న మండలాల వారీగా జనాభా, కుటుంబాల వివరాలు పంపించారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,85,585 కుటుంబాలుండగా 23,44,439 జనాభా ఉన్నట్టు తేల్చారు. మండలాల వారీగా ఉన్న ఈ సమాచారం పంపించారు. ప్రభుత్వం వద్ద ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉందో సమాచారం ఉన్నందున వీటి ఆధారంగా విభజన పక్రియ చేపడతారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని భవనాల వివరాలు కూడా అన్‌లైన్‌లో సంబంధిత సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లా, డివిజన్ కార్యాలయాల భవనాలతో పాటు మండల స్థాయిలో ఉన్న భవనాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 106 శాఖలు ఉన్నాయి. ఇందులో విజయనగరంలో 106శాఖలు ఉండగా పార్వతీపురంలో 37 శాఖలు ఉన్నాయి. ఈశాఖల పరిధిలో మొత్తం 387 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. విజయనగరం డివిజన్‌లో 252, పార్వతీపురం డివిజన్‌లో 387 భవనాలు గుర్తించారు. ఆ వివరాలు అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలో శాఖల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలు సిద్ధమవుతున్నాయి. శాఖలవారీగా పార్వతీపురం వెళ్లాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాపై ఉన్నతాధికారుల సూచన మేరకు కసరత్తు చేస్తున్నారు.
మొత్తం మీద జిల్లాల విభజన ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు, ఏ క్షణానైనా అందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.











