(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘జగన్ గారు కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఎందుకు .. దీనివల్ల ఉపయోగం ఏంటి? చెయ్యాల్సింది ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసేయాల్సింది. లీకులిచ్చి .. ఇది చేసి అది చేసే బదులు .. తీర్మానం చేసి అప్పుడే దానిపై అభిప్రాయాలు తీసుకుంటే ఏదో ఒకటి తేలిపోయేది’ అంటూ అమరావతి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ స్వయాన ఆ పార్టీకి చెందిన విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడిన రికార్డెడ్ ఆడియో ఒకటి గురువారం బయటపడి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యంగా వైసీపీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి సెగలను బయట పెట్టింది.
Must Read: టీడీపీ కార్యకర్తలంటే భయమెందుకు: నారా లోకేష్
ఖబడ్దార్ ..
‘బెదిరిస్తే బెదిరిపోడానికి మేమేమీ బానిసలం కాము .. మేము బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులం .. అవసరమొస్తే దేనికైనా సిద్ధం .. ఖబడ్దార్’ అంటూ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మీడియా మొఖంగా బుధవారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ను ఘాటుగా హెచ్చరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానికులు దేవుని కోసం ఒక చిన్న మండపం కట్టుకునే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే అలజంగి అడ్డుకుంటున్నారని బీజేపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆరోపించడం, దానిపై ఎమ్మెల్యే అలజంగి తీవ్రంగా స్పందించడం తెలిసిందే. దైవకార్యానికి వైసీపీ, బీజేపీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టతకు పోయి రాజకీయ రంగు పులమటం శోచనీయమని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి తప్ప రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. దీనిపై అలజంగి ఘాటుగా స్పందించడం పార్వతీపురంలో పెద్ద రగడ సృష్టించింది.
కొద్దిరోజులుగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు వ్యవహార శైలి వివాదాస్పదమవుతూ జిల్లా, రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
Also Read: ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన.. అట్టుడికిన విజయనగరం