తెలంగాణ బీజేపీలో ఇద్దరు ముఖ్యనేతల మధ్య చిచ్చురాజుకుందా. తమ పంతం నెగ్గించుకునేందుకు ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు అంతర్గతంగా రగిలిపోతున్నారని చెబుతున్నారు వారి సన్నిహితులు. తనను కనీసం సప్రదించకుండా ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఓ నేత అంటుంటే.. పార్టీ బలోపేతం అవుతుంటే ఎందుకు ఇబ్బందని మరో నేత ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీ నుండి వచ్చి బీజేపీలో చేరి తమ కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారే. ఇద్దరూ కూడ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సన్నిహితంగా ఉండే వారే. పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ జాతీయ నాయకత్వం దృష్టిలో కూడా వారు మంచి మార్కులు సాధించారు. ప్రస్తుతం వారి మధ్య రగడ సంజయ్‌కి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో ఓ నేత బిజీ..
తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆ నేత విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తనతో కలిసి పనిచేసిన నేతలందరనీ కలిసి మంతనాలు సాగిస్తున్నారు. కొంత మందిని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా.. మరికొంత మంది నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరినీ తానే ఒప్పించి లైన్ క్లియర్ చేశారు. సంక్లిష్టంగా ఉన్న నేతల గురించి నేరుగా ఢిల్లీ పేద్దలతో మాట్లాడి మరీ ఒప్పించుకొస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చంద్ర శేఖర్‌ను పార్టీలోకి రప్పించడంలో సక్సెస్ అయ్యారు. తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి భవిష్యత్‌లో బీజేపీ ఎలా ఉండబోతున్నదన్నది వివరించి ఒప్పించారు. సంక్రాంతి తరువాత ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో బీజేపీ సీనియర్ నేతకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని టాక్ నడుస్తోంది.
Must Read ;- కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకున్నప్పుడు.. బీజేపీలో చేరతానన్న కొండా
సంజయ్‌కి అన్ని విధాల అండగా ఉంటానంటూ..
ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి అన్ని తానై వ్యవహరిస్తున్నారు ఆ నేత. ఎక్కడికి వెళ్ళినా సంజయ్ వెంటే ఉంటూ ఆయనకు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీ పెద్దలకు కూడా ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు ప్రోత్సహిస్తున్న నేతలపై తీవ్ర అసహనంతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్‌కి సన్నిహితంగా ఉండే నేత సంక్రాంతి తరువాత పార్టీలో చేరబోయే చంద్రశేఖర్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఆయన గతంలో తాను పనిచేసిన పార్టీలో ఉన్న నేత కావడమే ఆ సీనియర్ ఆగ్రహానికి కారణమని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చివరి వరకు చంద్రశేఖర్ పార్టీలోకి వచ్చేందుకు సంశయించింది ఈ నేత కోసమే అని చెబుతున్నారు. చంద్రశేఖర్‌ను ఎలాగొలా ఒప్పించి బీజేపీలో చేర్పించడంలో సక్సెస్ అయిన మరోనేతపై ఆయన ఒంటి కాలుపై లేస్తున్నారని .. పార్టీలో సమావేశాల్లో తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య వార్ ఏ దరికి చేరుతుందన్న ఆసక్తి నెలకొంది. పార్టీ అభివృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేసుకు పోవాలని అధిష్టానం సూచిస్తుందా.. చిలికి చిలికి గాలివానగా మరక ముందే వారి వివాదం సమసిపోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు బీజేపీ పార్టీ నేతలు.
Also Read ;- రజనీ మద్దతు ఎవరికి.. కమల్ కా.? బీజేపీకా.?