బెజవాడ దుర్గగుడిలో 20 నెలలుగా సాగుతున్న అరాచకాలపై ఏసీబీ నిఘా వేసింది. ఇవాళ 12 మంది ఏసీబీ అధికారులు గుడిలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. దుర్గగుడిలో టికెట్లు కుంభకోణంతో పాటు, చీరలు, ప్రసాదాల అమ్మకాల్లోనూ భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దుర్గగుడి దర్శనం కోసం అమ్మే రూ.300 టిక్కెట్లలో భారీగా నకిలీ టిక్కెట్లు అమ్మినట్టు అధికారులు గుర్తించారు. అమ్మవారికి భక్తులు సమర్పించే ఖరీదైన పట్టు చీరెలను కూడా పక్కదారిపట్టించినట్టు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇక దుర్గగుడిలో ఇటీవల కాలంలో స్క్రాప్ అమ్మకాల్లో కోటి 35 లక్షల కుంభకోణం జరిగినట్టు వెల్లడైంది. ఎలాంటి టెండర్ లేకుండానే కోటిన్నర విలువైన స్క్రాప్ ను కేవలం పదిహేను లక్షలకు కాజేశారని ఏసీబీ గుర్తించింది. దీని వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈవో నుంచి వివరణ తీసుకున్న అధికారులు
దుర్గగుడి ఈవో సురేష్ బాబు నుంచి ఏసీబీ అధికారులు వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది. అమ్మవారి గుడిలో పార్కింగ్ నుంచి మొదలు పెడితే టిక్కెట్ల అమ్మకం, చీరలు, ప్రసాదాలు, షాపుల కేటాయింపు ఇలా ప్రతి దానిలో అవకతవకలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని వెనుక ఉన్న సిబ్బందిని గుర్తించే పనిలో పడ్డారు. త్వరలో దుర్గగుడి కుంభకోణంపై సీఎంఓకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు… అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. త్వరలో చర్యలు తీసుకోవడంతో పాటు, కొందరిని అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
Must Read ;- మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు











