ఏపీ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడం ఎలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వవలసిందిగా జగన్ సర్కార్ గత ఏడాది నవంబర్ లో అహ్మదాబాద్ ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 9 నెలలు ఈ అంశంపై అధ్యయనం చేసిన కమిటీ రెండు రోజుల కిందట ప్రభుత్వానికి తమ నివేదికను అందచేసింది. అవినీతి నిర్మూలనకు పలు సూచనలు చేస్తూ ఈ నివేదికను చైర్మన్ సుందర నారాయణ స్వామి ఏపీ ప్రభుత్వానికి అందచేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం ద్వారా అవినీతికి చెక్ పెట్టవచ్చని నివేదికలో సూచించారు. ఏపీలో అవినీతి పెరగడానికి మీడియా ఓ ప్రధాన కారణమని అహ్మదాబాద్ ఐఐఎం చెప్పడం సంచలనం కలిగించింది.
ఏపీ స్థానిక మీడియా ప్రభుత్వ పరిపాలనలో విధ్వంసకర పాత్ర పోషిస్తుందని తమ నివేదికలో తేల్చిచెప్పింది. పలు కీలక అంశాలలో మీడియా తమ సొంత భావజాలాన్ని ఉపయోగించడమే గాకుండా మధ్యవర్తిత్వం వహిస్తుందని చెప్పుకొచ్చింది. ప్రతి అంశంలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న మీడియాను దూరం పెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. మీడియాను దూరం పెట్టకపోతే పరిపాలనలో గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ స్థానిక మీడియా పుకార్లు పుట్టించి అధికార యంత్రాగంపై ఒత్తిడి పెంచుతోందని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై స్థానిక మీడియా తమ సొంత అభిప్రాయాలతో కథనాలు రాస్తోందని దీంతో అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఈ విషయంపై ద్రుష్టి సారించాలని నివేదిక సూచించింది.
పరిపాలనలో విధ్వంసకరమైన పాత్ర పోషిస్తున్న మీడియా కథనాలలో నిజాయితి చాలా తక్కువ శాతంలో ఉందని అభిప్రాయపడింది. అవినీతిలేని పరిపాలన అందించాలంటే నాయకుల మితిమీరిన జోక్యాన్ని అడ్డుకోవడమే గాక, మీడియాను కూడా నిలువరించాలని కీలక సూచన చేసింది. ప్రభుత్వ కార్యాలయాలలో సీసీ కెమెరాలను పెట్టాలని సూచించిన కమిటీ రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేయాలని సూచించింది. ప్రజలకు రియల్ టైంలోనే సమాచారాన్ని అందించేలా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఐఐఎం సిఫార్స్ చేసింది. మీడియా పాత్ర గురించి ఐఐఎం రిపోర్టు రాష్ట్ర రాజకీయాలలో పలు సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది.