పింక్ బాల్ టెస్టులో జరిగిన పరాభవానికి టీమిండియా దీటైన సమాధానం చెప్పింది. విజయగర్వంతో విర్రవీగుతున్న ఆసీస్ మెడలు వంచింది. రహానె సారథ్యంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. మెుదటి టెస్టులో ఎదురైన పరాజయానికి చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ దూరమైనప్పటికీ రహానే నేతృత్వంలో విజయం సాధించిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ టెస్ట్‌లో రోహిత్ శర్మ తుది జట్టులో చేరే అవకాశం ఉంది.
ఎనిమిది వికెట్ల తేడాతో…
బాక్సింగ్ డే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. కెప్టెన్ అజింక్యా రహానె(27; 40 బంతుల్లో 3×4), ఓపెనర్ శుభ్‌మన్ గిల్(35; 36 బంతుల్లో 7×4) మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా భారత్ 15.5 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. తొలుత ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), పుజారా(3) మళ్లీ నిరాశ పరిచారు. 19 పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుట్ అయిన నేపథ్యంలో రహానె, గిల్ బాధ్యతాయుతంగా ఆడి.. ఇండియాకు గుర్తుండిపోయే విజయాన్ని అందించారు. ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌కు మంచి విజయాన్ని కట్టబెట్టారు.
భారత్ బౌలింగ్ ముందు…
ఆసీస్ 33/6 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగింది. కానీ.. మరో 67 పరుగులకే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్(45; 146 బంతుల్లో 5×4), కమిన్స్(22; 103 బంతుల్లో 1×4) మినహా మిగత ఆటగాళ్లంతా భారత్ బౌలింగ్ ముందు చేతులెత్తేశారు. బుమ్రా బౌలింగ్‌లో కమిన్స్ మయాంక్ చేతికి చిక్కడం వల్ల నాలుగో రోజు ఆస్ట్రేలియా తొలి వికెట్ నష్టపోయింది. మరో 21 పరుగుల తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో గ్రీన్ జడేజా చేతికి చిక్కాడు. సిరాజ్ బౌలింగ్‌లోనే లియోన్(3) ఔటయ్యాడు. చివర్లో హెజిల్‌వుడ్(10), స్టార్క్(14) కొంతసేపు క్రీజులో నిలుస్తారేమో అనిపించింది. కానీ వాళ్లూ నిరాశే మిగిల్చారు. చివరి ఓవర్‌లో అశ్విన్.. హెజిల్‌వుడ్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జడేజా 2, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.
స్కోర్ వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195 ఆలౌట్ (లబుషేన్ 48, హెడ్ 38) బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్.. (రహానె 112, జడేజా 57) స్టార్క్ 3, లియోన్ 3 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 200 ఆలౌట్.. (గ్రీన్ 45, వేడ్ 40) సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జడేజా 2 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్ : 70/2.. (శుభ్‌మన్ గిల్ 35, రహానె27)
Must Read ;- ‘బాక్సింగ్ డే టెస్టు’ అంటే ఏంటి.. దానికాపేరు ఎలా వచ్చింది?