పై ఫొటో చూశారు కదా. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఫిజికల్ ఎక్సర్ సైజులకు సంబంధించిన కోచ్ కాదు. జిమ్ ట్రైనర్ అంతకంటే కూడా కాదు. ఆయన దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా ఉన్న తమిళనాడుకు ముఖ్యమంత్రి. పేరు ఎంకే స్టాలిన్. తమిళనాడులోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న డీఎంకే అధ్యక్షుడు కూడా. మొత్తంగా రాజకీయవేత్త. మరి రాజకీయవేత్త అయితే… ఏదో ఏపీ సీఎం జగన్ లాగా వీడియో గేమ్ప్ ఆడుకుంటూనో, లేదంటే తెలంగాణ సీఎం మాదిరి ఫాం హౌజ్ లో రెస్ట్ తీసుకుంటూనో కనిపించాలి గానీ… ఇలా కండలు పెంచే వీరుడిలా ఈ కసరత్తులు ఏమిటి అనుకుంటున్నారా?. ఎంత సీఎం అయితే మాత్రం ఫిజికల్ గా ఫిట్ నెస్ లేకపోతే… మెంటల్ గా కూడా ఫిట్ నెస్ తప్పిపోతారు కదా. అందుకే… ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రస్థానం మొదలెట్టిన స్టాలిన్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు ఇలాంటి కసరత్తులు చేస్తూ… ఫిజికల్ ఫిట్ నెస్ ప్రాధాన్యాన్ని చాటుతూ తన వీడియోను విడుదల చేశారు.
జగన్ వీడియో గేమ్ లు ఆడతారా?
సోషల్ మీడియాలో కనిపించిన ఈ ఫొటో, వీడియో చూడగానే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే… సీఎం అయ్యాక కాస్తంత డల్ గా మారిపోయిన జగన్… సాయంత్రమైతే ఆఫీసు నుంచి ఇల్లు చేరుకుని వీడియో గేమ్స్ తో కాలక్షేపం చేస్తారని విపక్షం టీడీపీ వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ వీడియో గేమ్ లు ఆడతారో, లేదో తెలియదు గానీ… ఇంటిలో ఆయన ఏం చేస్తారన్నది జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. అయితే కసరత్తులు చేస్తున్న స్టాలిన్ ను చూడగానే… మన నేతలు కూడా ఇలాంటి కసరత్తులు చేస్తూ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే ఎంత బాగుంటుంది అన్న భావన కలగక మానదు.
ప్రచార ఆర్భాటం లేని స్టాలిన్
మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో రికార్డు విక్టరీ నమోదు చేసిన స్టాలిన్.. ఆ రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పనిలో పడిపోయిన స్టాలిన్ మన నేతలకు మాదిరిగా ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఎంచక్కా ప్రజా సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఏ పథకానికి కూడా తన తండ్రి పేరు గానీ, తన పార్టీ పేరు గానీ పెట్టుకోకుండా… కేవలం తమిళనాడు సర్కారు అనే ముద్రతోనే తన సంక్షేమ పాలనను సాగిస్తున్న స్టాలిన్ ను మన నేతలు ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటారోనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.