తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అన్నా డీఎంకేలో చీలిక వచ్చింది. కాబోయే సీఎం ఎవరంటూ ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్దతుగా నిలవగా మరో వర్గం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు నిలిచారు. గత కొన్ని రోజులుగా ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ పోరు బహిర్గతమైంది.
బీజేపీ మహత్యమా
ఉత్తరాది రాష్ట్రాలలో గట్టిపట్టున్న బీజేపీ చాలా రోజులుగా దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో తప్పా ఇతర రాష్ట్రాలలో ఫలించలేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయం వారికి ఆశాజనకంగా కనిపించింది. స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లతో టచ్ లో ఉన్న బీజేపీ మరోవైపు తమ క్యాడర్ ను పెంచుకునేందుకు రంగం సిద్ధం చేసింది. మేధావులు, రాజకీయ నిపుణులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ మనవరాలును పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ అన్నా డీఎంకేపై ద్రుష్టి సారించింది.
జయలలిత మరణం తరువాత ఆ పార్టీలో ఆధిపత్యపోరు నెలకొంది. ఆ సమయంలోనే అక్రమాస్తుల కేసులో శశికళను జైలుకు పంపి పళనిస్వామికి బీజేపీ లైన్ క్లియర్ చేసిందని వార్తలు ప్రచారం జరిగాయి. అందుకు ప్రతిగా పళనిస్వామి పలు విషయాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు మద్దతు పలికారు. జయలలిత ‘నిచ్చెలి’ శశికళ ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు. ఆమె వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నారు. ఆమెతో ఇప్పటికే బీజేపీ రహస్య మంతనాలు జరిపిందని తమిళనాడు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్-శశికళ-పళనిస్వామిలతో కలిసి బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.











