ఏపీలో అదికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుయకోసం సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్… ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారుల వద్ద కీలక విషయాలు వెల్లడించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల మేరకు.. అమరావతి నిర్మాణం కోసం జరిగిన ల్యాండ్ పూలింగ్ లో భాగంగా.. అమరావతి పరిధిలోని దళితులకు చెందిన అసైన్డ్ భూములతో పాటు తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలెట్టిన ఏపీకి.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతిని నూతన రాజధానిగా నాటి చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ల్యాండ్ పూలింగ్ వెనుక పెద్ద అవినీతి తంతు దాగుందని ఆరోపించిన వైసీపీ.. రైతుల భూములను బలవంతంగా లాగేసుకుందని ఆరోపించింది. అంతేకాకుండా ఈ క్రమంలో దళితుల నుంచి దాదాపుగా 4 నుంచి 5 వేల ఎకరాల అసైన్డ్ భూములను తమ అనుయాయులకు మళ్లించిన చంద్రబాబు సర్కారు భారీ అవినీతికి పాల్పడిందని స్వయంగా జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
చెరుకూరిపై వార్తలు.. మీడియా ముందుకు ఆళ్ల
ఈ వ్యవహారంపై తాను అధికారంలోకి రాగానే.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన జగన్.. దానిపై దర్యాప్తు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. తమకు అలాంటి ఆరోపణలేమీ కనిపించలేదని సీఐడీ దర్యాప్తును నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించిన జగన్ సర్కారు.. ఆయన చేత ఆరోపణలు చేయిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాడు మీడియా ముందుకు వచ్చిన ఆళ్ల.. అమరావతి పరిధిలోని దళితుల అసైన్డ్ భూములతో పాటు మాజీ సైనికులకు చెందిన భూములను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా బెదిరింపులకు గురి చేసి లాగేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఆ మేరకు ఆయన ఓ వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో సీఆర్డీఏకు కమిషనర్ గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ ను సీఐడీ అధికారులు విచారించినట్లుగా, విచారణలో భాగంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.
నారాయణ, ప్రత్తిపాటిలకు పాత్ర ఉందట
ప్రభుత్వ అనుకూల మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… 2015లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలైతే 2014లోనే అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల వివరాలన్నీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు సేకరించారని చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అంతేకాకుండా ఈ రికార్డులన్నింటినీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే నారాయణ తీసుకెళ్లిపోయారట. అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ నిబంధనల రూపకల్పన సందర్భంగా ప్రభుత్వం సూచనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని శ్రీధర్ చెప్పారట. అయితే ఆ మాటలను లెక్కచేయని నారాయణ.. తాము చెప్పినట్టుగా వినాల్సిందేనని, నిబంధనలను పక్కనపెట్టాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ క్రమంలో నారాయణతో పాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాదల రాజేంద్ర, జంగా సాంబశివరావు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన కేవీపీ అంజనీకుమార్, గుమ్మడి సురేశ్ లతో కలిసి తిరిగేవారని కూడా శ్రీధర్ చెప్పారట. మొత్తంగా సీఆర్డీఏ కమిషనర్ గా తాను చెబుతున్నా వినకుండా మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు తమపై ఒత్తిడి తెచ్చి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా చేశారని సంచలన విషయాలు వెల్లడించారట.
ప్రత్తిపాటి స్పందన ఏంటంటే..?
సీఐడీ అధికారులకు చెరుకూరి శ్రీధర్ చెప్పినట్లుగా వస్తున్న ఈ వార్తలపై మాజీ మంత్రి నారాయణ అసలే స్పందించలేదు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కార్యకలాపాల్లో కూడా ఆయన కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ఎలాగైతే రాజకీయాలకు దూరంగా వ్యవహరించారో.. ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారనే చెప్పాలి. ఇక మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం ఈ వార్తలపై స్పందించారు. అసలు రాజధాని భూముల వ్యవహారంలో తన ప్రమేయమే లేదని ఆయన కొట్టిపారేశారు. తన శాఖ కాని మునిసిపల్ మంత్రిత్వ శాఖలో తానెందుకు జోరబడతానని కూడా ప్రత్తిపాటి ప్రశ్నించారు. తనతో తిరిగినట్లుగా చెబుతున్న గుమ్మడి సురేశ్ ఎవరో కూడా తనకు తెలియదని, తనను ఆయన ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు. ఇక అమరావతి పరిధిలో సెంటు భూమి ఉందని నిరూపిస్తే.. ప్రభుత్వం తీసుకోవచ్చని కూడా ప్రత్తిపాటి సవాల్ విసిరారు.
ఈ వార్తలను నమ్మేదెలా?
ఇదిలా ఉంటే..చెరుకూరి శ్రీధర్ చెప్పిన వివరాలను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించి… మాజీ మంత్రిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా చెరుకూరి శ్రీధర్ ను సీఐడీ విచారించిన విషయమే పెద్దగా బయటకు రాలేదు. అలాంటి సమయంలో ఆయన ఇన్ని సంచలన విషయాలను వెల్లడించారని చెబుతున్న వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. చెరుకూరి శ్రీధర్ చిన్న స్థాయి అధికారేమీ కాదు. ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ స్థాయి అధికారిని సీఐడీ విచారణకు పిలిస్తే.. మీడియాకు తెలియకుండా పోతుందా? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఇన్నేసి అనుమానాల మధ్య.. ఈ వార్తలన్నీ కేవలం ప్రభుత్వ అనుకూల మీడియాలోనే వరుసగా స్క్రోల్ అవుతున్న తీరు, ఆ వార్తల వెనుకే వస్తున్నట్లుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా స మావేశం పెట్టడం చూస్తుంటే… ప్రభుత్వం ఏదో పెద్ద వ్యూహాన్నే అమలు చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.











