ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కాంగ్రెస్ పార్టీలో చెరబోతున్నారు.. దాదాపు ఆయన చేరిక ఖరారు అయిపోయింది.. ఇది నిన్నటి వరకు జరిగిన చర్చ. కానీ తాజాగా కాంగ్రెస్ లో చెరబోవడం లేదంటూ అదే పీకే చేసిన ప్రకటన సంచలనంగా మారిందట. పీకే నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి ? నిజంగా పీకే నిర్ణయం వెనుక కెసిఆర్ వ్యూహం ఉందా ? ఇంతకీ పీకే మనసు మార్చింది ఎవరు ?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కాంగ్రెస్ పార్టీలో చెరబోతున్నారు అనే చర్చ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బలంగా వినిపించింది. అయితే తాను కాంగ్రెస్ లో చెరబోవడం లేదంటూ పీకే చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పలు మార్లు కాంగ్రెస్ లో చేరిక పై ఆ పార్టీ అధినాయకత్వంతో భేటీ అయిన పీకే సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ ఉదంతం పై ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
నిజానికి పీకే చాలా కాలంగా బిజెపి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నారనే చర్చ జరుగుతూ ఉంది. కాగా పలుమార్లు మోడీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది అంటూ ఆయనకు వ్యతిరేకంగా పీకే చేసిన ట్వీట్ లు కూడా పెను దుమారమే లేపాయి. ఇటీవల పీకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో పలుమార్లు సమావేశం అవడం కూడా బిజెపి, మోడీకి వ్యతిరేకంగా ఉన్నందునే అనే వాదన వినిపించింది. దీంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పీకే చెరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రేపో మాపో ఆయన చేరిక ఉంటుందనే ప్రచారం కూడా సాగింది.
ఇప్పటికే ప్రశాంత కిషోర్ పలు రాష్ట్రాలలో అనేక రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పార్టీలని అధికారంలోకి తెచ్చేందుకు అనేక కుయుక్తులు పన్నుతూ కొన్ని చోట్ల సక్సెస్ కూడా అయ్యారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారిమోగింది. ఇక మోడీ పై గుర్రుగా ఉన్న పీకే బిజెపిని ఎలాగైనా గద్దె దించాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారట. ఈ నేపధ్యంలోనే పలు మార్లు ఆ పార్టీ అధినాయకత్వంతో చర్చలు కూడా జరిపారు.
ఈ చర్చల సందర్భంగా ప్రశాంత కిషోర్ కాంగ్రెస్ బలోపేతానికి కొన్ని ఫార్ములాలు కూడా చెప్పారట. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు ఆయన తన వ్యూహాలను అధిష్టానం వద్ద చర్చించారట. అంతేకాకుండా 2024 ఎన్నికల నాటికి అనేక రాష్ట్రాలలో తాను వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుస్తానని, తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టేదిశగా ఒక రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని టాక్. ఇక దాదాపు దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ సైతం పీకే వంటి వారిని పార్టీలో చేర్చుకుంటే ఎంతోకొంత తమకు లాభం చేకూరుస్తుందనే ఆలోచనకి వచ్చి, ఆయన చేరికకు ఓకే చెప్పిందట.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ లు పీకే చేరికను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.ఇక ఇదే అంశాన్ని పలుమార్లు బహిరంగంగా కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్‌కు సైద్ధాంతిక నిబద్ధత ఉండదని, ఒక్కోసారి ఒక్కో పార్టీకి పనిచేసిన వ్యక్తిని విశ్వసించలేమనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమయ్యిందట. కాంగ్రెస్ లో చేరాక కూడా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ కు తన సంస్థ ఐప్యాక్ పని చేస్తుందని పీకే చెప్పడం అధిష్టానానికి నచ్చలేదట.ఈ క్రమంలోనే పార్టీలో చేరాలంటే ఐప్యాక్ సంస్థను మూసివేయాలని కాంగ్రెస్ పెద్దలు పీకేకు చెప్పారట. అయితే అందుకు ప్రశాంత్ కిశోర్ ఇష్టపడకపోవడం వారికి రుచించలేదట.
అయితే హటాత్తుగా పీకే కాంగ్రెస్ హ్యాండిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారిందట. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం దాగుందనే వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన పీకే టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో రెండు రోజుల పాటూ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో పీకే చేరిక , ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకెళ్లడం వంతో అంశాలపై చర్చించారని, అయితే కెసిఆర్ అందుకు నో చెప్పారని టాక్. ఈ చర్చల అనంతరం కాంగ్రెస్ లో చేరిక పై పునరాలోచన చేసిన ప్రశాంత్ కిషోర్ తాను పార్టీలో చేరడం కంటే వ్యూహకర్తగా ఉండటానికే ఇష్టపడతానూ అంటూ ప్రకటన చేశారు.
పీకే ప్రకటన పై కాంగ్రెస్ నాయకత్వం సైతం విమర్శలు గుప్పిస్తోందట. పిలిచి పిల్లనిస్తా అంటే వద్దు పొమ్మన్నాడట వెనకటికి ఒకడు, ప్రస్తుతం ప్రశాంత కిషోర్ వ్యవహారం కూడా అలాగే ఉందని మరికొందరు బహిరంగంగానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.మరోవైపు పీకే నిర్ణయం పై పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలహాదారుడిగా ఉంటే పార్టీ సక్సెస్ అయితే క్రెడిట్ తనకే దక్కుతుంది.. ఫెయిల్ అయితే లైట్ తీసుకోవచ్చు.. ఈ పార్టీ కాక పోతే మరో పార్టీకి సర్వీస్ ఇయ్యోచ్చు.. అదే నాయకుడిగా తాను చెప్పిన టార్గెట్ ను పూర్తి చేయ్యక పోతే , ఆ ఫెయిల్యూర్ ను ఫేస్ చేయటం అంత ఈజి కాదు అనే ఆలోచనతోనే పీకే కాంగ్రెస్ పార్టీకి నో చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా వారంరోజులుగా మాత్రం ప్రశాంత్ కిషోర్ ఫుల్ పాపులర్ అయిపోయాడు.