నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైసీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నిజంగానే భయం కొట్టొచ్చినట్టుగానే కనిపిస్తోందని చెప్పక తప్పదు. జగన్‌లోని భయాన్ని ఆయన హావభావాలే బయటపెడుతున్నాయన్న చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. విపక్ష నేతగా ఉన్న సమయంలో నాడు అధికార పార్టీగా ఉన్న టీడీపీపై విరుచుకుపడిన జగన్‌ను చూసిన వారంతా… ఇప్పుడు సీఎం హోదాలో అసెంబ్లీలో జగన్ వ్యవహార సరళిని చూసి విస్తుపోతున్నారని కూడా చెప్పక తప్పదు. విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌లో ఓ రేంజి ఫైర్ కనిపించగా… ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్‌లో అది మచ్చుకైనా కనిపించకపోగా… ఆయన హావభావాల్లో భయం కొట్టిచ్చినట్టుగానే కనిపిస్తోందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
విపక్ష నేతగా..
గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా కాలం పాటు అసెంబ్లీ సమావేశాలకూ దూరంగా ఉండిపోయిన జగన్… మొన్నటి ఎన్నికల్లో సీఎంగానే సభలో అడుగు పెట్టారు. విపక్ష నేతగా ఉండగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నానని చెప్పే దాకా ప్రతి సమావేశంలోనూ జగన్‌లో ఓ రేంజి ఫైర్ కనిపించేది. తనపై అధికార పక్ష సభ్యులు విసిరే సవాళ్లకు ఆయన ధీటైన సమాధానాలే ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఒక్కోసారి కట్టు తప్పినట్టు కనిపించినా… కూడా తమాయించుకుని నిలబడి మాట్లాడేవారు. మొత్తంగా విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మంచి ప్రదర్శనే కనబరచారని చెప్పక తప్పదు.
అధికారం అందగానే..
అయితే అధికారం అందగానే జగన్‌లో భయం అంతకంతకూ పెరిగిపోతోందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. సభలో విపక్ష టీడీపీ సభ్యులు ఏ ఆరోపణలు చేసినా… జగన్ నోట నుంచి ఒకే మాట పదేపదే వినిపిస్తోంది. అదేంటంటే… ‘మీరు కళ్లు పెద్దవి చేసి చూసినంత మాత్రాన మేం భయపడిపోం’ అంటూ జగన్ పదే పదే అంటున్నారు. సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగానే విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధికార పక్షంపై విరుచుకుపడితే… కూర్చున్న సీట్లో నుంచి లేవకుండానే కళ్లు పెద్దవి చేసి చూసినంత మాత్రాన మేం భయపడిపోం అంటూ జగన్ తన హావభావాల ద్వారా చెప్పేశారు. మేం భయపడిపోం అన్న మాట పదే పదే జగన్ నోట నుంచి వస్తుంటే… చూసేవాళ్లు మాత్రం భయపడే వాళ్ల నోట నుంచి ఈ మాట వస్తుందంటూ గుర్తు చేస్తున్నారు.