అర్థసత్యాలతో ఎదుటివాడిని మోసం చేయడం, తద్వారా అనుచిత లబ్ధిని పొందడం అనేది ఇవాళ కొత్తగా మొదలైన సంస్కృతి కాదు. కురుక్షేత్రంలో ధర్మరాజుగా పేరున్న యుధిష్టరుడు ‘అశ్వత్థామ హతః’ అని పెద్దగానూ, ‘..కుంజరః’ అని చిన్నగానూ అన్నప్పుడే ధర్మం, న్యాయం మంటగలిసిపోయాయి. ఇక మనమెంత? తమకు పనికి వచ్చే భాగాన్ని మాత్రం ప్రచారంలో పెట్టి.. దానికి అసలుకంటె భిన్నమైన అర్థం వచ్చేలా ప్రజల మనసుల్లోకి నెట్టి.. అనుచితమైన ప్రయోజనం ఆశించడం రాజకీయనాయకులకు చాలా మామూలు సంగతి. కాకపోతే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలాంటి దుర్నీతిని పరాకాష్టకు తీసుకువెళ్తోంది. ఏకంగా న్యాయవ్యవస్థ మీదే, న్యాయమూర్తుల మీదే విషప్రచారానికి తెగబడుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు యుక్తాయుక్త విచక్షణకు నీళ్లొదిలేశారు. మసిగుడ్డ కాల్చి తమకు కిట్టని వారి మొహాన వేయడం వరకే తమ పని.. అంటిన మసిని కడుక్కుని, శుభ్రం చేసుకోవడం అవతలి వారి ఖర్మ, వారి ప్రారబ్ధం అన్న తీరుగా వారి వ్యవహార సరళి ఉంటోంది. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు వస్తున్నాయి. వరుసగా ఇలాగే జరుగుతూ ఉంటే, ఎవరైనా సరే… తమ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుంటారు. కానీ.. జగన్ సర్కారు మాత్రం ప్రతిసారీ సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ కూడా తిరస్కరణకు గురవుతూనే ఉంది. అందుకే కొత్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేసింది.
న్యాయమూర్తులపైనే విష ప్రచారం
తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వానికి ఆటంకాలు కలిగిస్తున్నారని తలపోశారో ఏమో గానీ.. ఏకంగా న్యాయవ్యవస్థ మీదనే దాడికి దిగారు. సీఆర్డీఏ లావాదేవీల గురించి ఏసీబీకి అప్పగించిన కేసు విచారణ మీడియాలో రాకూడదని కోర్టు నిషేధాజ్ఞలు జారీచేసిన వెంటనే వారికి ఆగ్రహం వచ్చింది. హైకోర్టు నిర్ణయంపై పార్టీ నాయకుడు సజ్జల రామక్రిష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈలోగా.. ఇంకాస్త జాగ్రత్తగా.. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకునేలా.. ఒక విష ప్రచారానికి తెరతీశారు.
హైకోర్ట్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించిన జగన్ సర్కార్!
అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీయే వివిధ అధికార, ఉద్యోగ సంఘాల వారికి నివాస స్థలాలను విక్రయించింది. ఇది పూర్తిగా విక్రయం! ఆ క్రమంలో న్యాయమూర్తులు కూడా ఒక సొసైటీగా ఏర్పడి ఇంటి నివాస స్థలాలు కొనుగోలు చేశారు. ఆ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు తాము కొత్తగా కనిపెట్టినట్టుగా బయటకు తెచ్చింది.
13 మంది హైకోర్టు న్యాయమూర్తులు అప్పట్లో సీఆర్డీయే నుంచి ఇంటిస్థలాలు కొనుగోలు చేశారు. దీనిని చంద్రబాబు నాయుడు వారికి నివాస స్థలాలు కేటాయించినట్లుగా తాజాగా ప్రచారంలోకి తెచ్చింది. న్యాయమూర్తులు.. ప్రభుత్వం నుంచి ఇలాంటివి ఏవీ పొందకూడదంటూ నీతులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వల్లిస్తోంది. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా జరిగిందంటూ వక్రభాష్యాలు చెబుతోంది. ఎప్పుడో జరిగిన నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ మాత్రమే గత ఏడాది ఏప్రిల్ 24న జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మరో అంశాన్ని బయటకు తీశారు. అదివరలో గుజరాత్ లో న్యాయమూర్తులకు ఇంటిస్థలాలు కేటాయించిన వ్యవహారంలో వారికి నోటీసులు వెళ్లడం గురించి ప్రస్తావించారు. అయితే అక్కడ కూడా వారు అర్థ సత్యాలను మాత్రమే ప్రచారంలో పెట్టి.. న్యాయ వ్యవస్థ మీద బురద చల్లేందుకు సాహసించారు.
గుజరాత్ లో 27 మంది న్యాయమూర్తులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరలకు చౌకగా స్థలాలు తీసుకున్నారు. అలా తీసుకోవడం మాత్రమే కేసు అయింది. అయితే అమరావతి విషయంలో.. న్యాయమూర్తులు గజం 5000 వేల రూపాయల వంతున ధర చెల్లించి కొనుగోలు చేశారు. అందులో కొందరు బ్యాంకు లోన్లు తీసుకుని మరీ ఈ స్థలాలు కొన్నారు. ఇంకొక తేడా కూడా గమనించాలి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో అత్యంత పోష్ ఏరియాగా పరిగణించే గోటా ఏరియాలో జడ్జిలకు ‘సబ్సిడీ ధరలకు’ విక్రయించడం మాత్రమే వివాదం అయింది. అయితే ఇక్కడ అమరావతి పరిస్థితి ఏమిటి? వారు కొన్న సమయానికి అక్కడ రాజధాని వస్తుందనే మాట తప్ప.. అదేమీ అభివృద్ధి చెందిన నగరం కాదు. అయినప్పటికీ వారు ఎకరం 5000 రూపాయల వంతున డబ్బు పెట్టి కొన్నారు. అప్పటికి అదేమీ చవక ధర కాదు. ఎందుకంటే..
అదే అమరావతి ప్రాంతంలో చంద్రబాబునాయుడు అమృత, వీఐటీ లాంటి యూనివర్సిటీలకు కూడా స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలను ఎకరా యాభైలక్షల వంతున ఒక్కొక్కరికి 200 ఎకరాలు విక్రయించారు. అదే ధర ప్రకారం గణించి చూస్తే ఒక్కో గజం గరిష్టంగా 1100 రూపాయలు పడుతుంది. అలాంటిది న్యాయమూర్తులు గజానికి రూ.5000 చెల్లించి కొనుగోలు చేస్తే అది తప్పెలా అవుతుంది?

నిజానికి ఈ స్థలంలో ఈ 13 మంది న్యాయమూర్తులు మాత్రమే కాదు.. 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అదే ధర చెల్లించి ఇంటిస్థలాలు కొన్నారు. కానీ ప్రస్తుతానికి న్యాయవ్యవస్థ మీద బురద చల్లడం ఒక్కటే వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యం గనుక.. న్యాయమూర్తులు స్థలాలు కొన్న సంగతిని మాత్రం బయటపెట్టి వివాదం రేపుతున్నారు.ఎన్జీవోలకు, గజిటెడ్ అధికారులకు అంతకంటె తక్కువ ధరకే స్థలాలను విక్రయించారు. ఆ రకంగా చూసినప్పుడు ఈషా ఫౌండేషన్ కు కేవలం 10 లక్షల రూపాయలకు ఎకరం వంతున 10 ఎకరాలు కేటాయించారు.
ఎకరం 10 లక్షలు అనేది కనీస ధరగా లెక్కిస్తే ఒక్కో గజం.. 200 రూపాయల పైచిలుకు మాత్రమే పడుతుంది. అలాంటిది గజానికి 5000 రూపాయలు చెల్లించడం అంటే.. ఎకరం విస్తీర్ణానికి 2 నుంచి 2.5 కోట్లరూపాయలు వెచ్చించి కొన్నట్టు లెక్క. ఇందులో అవినీతి, అనుచితంగా కట్టబెట్టడం, అక్రమం, అరాచకం ఏమున్నదో ఎవ్వరికీ అర్థ: కాని సంగతి.


ఈ మాత్రం లాజిక్ వైసీపీ మేధావులకు తెలియదని కాదు. కానీ.. వారి ఎజెండా వేరు. న్యాయవ్యవస్థ మీద బురద చల్లడం, న్యాయమూర్తులు చంద్రబాబునాయుడు కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రజల్లో అపోహ కలిగించడం, అనుమానాలు పుట్టించడం మాత్రమే. అందుకే ఇలాంటి విషప్రచారానికి తెరలేపారు.
ఏం సాధిస్తారు?
న్యాయమూర్తుల మీద బురద చల్లుతూ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలపై ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లింది. ఇలాంటి అర్థసత్యాలు, అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా వారి లక్ష్యం ఏమిటో అంతుచిక్కని సంగతి. ఒక అసత్యాన్ని వారు ప్రచారంలోకి తెచ్చినంత మాత్రాన.. దేశం కళ్లు మూసుకుని వారు చెప్పేదే విని, నమ్మే పరిస్థితి ఇవాళ్టి రోజుల్లో లేదు. సత్యం ఎంతోకాలం దాగదు.
ఒక్కరోజు అసత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో వారు సఫలం కాగలరేమో గానీ.. ఆ అసత్యంతో ప్రజలందరినీ నమ్మించగలరనుకోవడం భ్రమ. అసలు సత్యం వెలుగు చూసినప్పుడు.. వీరు చెప్పిన అసత్యాన్ని నమ్మిన ప్రజలంతా.. వీరి వ్యవహారసరళిని అసహ్యించుకుంటారు. చీదరించుకుంటారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందుకు ముందు ముందు ఇంకేమైనా తర్కబద్ధమైన ఆరోపణలు చేసినా కూడా.. వైఎస్సార కాంగ్రెస్ ను ప్రజలు అనుమానంగా చూసే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా వారి పార్టీకే పరువు పోతుంది.
పార్టీలో కనీసం ఆ భయం కూడా ఉన్నట్టు లేదు. న్యాయవ్యవస్థ ద్వారా తమ పార్టీ ప్రభుత్వం తలచినట్లుగా దూసుకుపోవడం కుదరడం లేదనే ఉక్రోషం వారిలో యుక్తాయుక్త విచక్షణను నశింపజేస్తున్నట్టుంది. ఇలాంటి అసమంజసమైన పోకడలు… వారి క్షణికోద్రేకాల్ని సంతృప్తి పరచగలవే తప్ప.. వారికి కూడా నిజమైన మేలు చేయవు.











