ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్ సర్కార్ కన్ను!
కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగులతో సంబంధంలేకుండా ఉద్యమం చేసేందుకు ఫ్యాప్టో నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాలు సన్నద్దమౌతున్నాయి. ఈనేపథ్యంలో పోయిన సోమవారం నుంచి ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ.. నిరసన తెలుపుతున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీపీఎస్ రద్దు, అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. వచ్చే శుక్రవారం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యంగా పిలుపు నిచ్చాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 12 సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటాయి. సీపీఎస్ రద్దు వంటివి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఉపాధ్యాయ నిరసనలకు మద్దతు తెలిపారు.
కఠిన నిబంధనలు అమలు..
ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ కన్నెసింది! బుధవారం నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ- హాజరులో టీచర్ల అటెండెన్స్ ని సాయంత్రానికి పంపాలని హుకుం జారీ చేసింది. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఈ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేసి, ఉద్యమించాలని చూస్తున్న ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది జగన్ సర్కార్! ఈ నేపధ్యంలోనే బయోమెట్రిక్ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.











