కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం మొదలైంది. త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రభావం కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఏ మేరకు ఉంటుంది? అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
తాజా బదిలీల్లో ఉపాధ్యాయులకు వచ్చిన పోస్టింగ్ ప్లేస్ కొత్త జిల్లాలో ఉంటే ఆ జిల్లా నుంచి సొంత జిల్లాకు మారాలంటే పరిష్కారం ఏమిటి? కొత్తగా ఏర్పడే జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంగ్త్ లో అసమానతలు ఉంటే తక్కువ ఉన్న జిల్లాలో వారిని ఎలా సర్ధుతారు? అప్పటి పరిస్థితి గురించి ముందుగానే అంచనా వేసి ఓ పరిష్కార మార్గాన్ని సూచిస్తారా? ఈ సందర్భంలో అటు జిల్లా ఇటు జిల్లాలలో ఉన్న స్పౌజ్ ల పరిస్థితి ఎలా ఉండబోతోంది? తక్షణ ఉపశమనం ఉంటుందా? కొన్నాళ్లపాటు ఎదురుచూపులు తప్పవా? అనే భయాలు ఉపాధ్యాయుల్లో కనిపిస్తున్నాయి.
గతంలో తెలంగాణ జిల్లాల విభజన సమయంలో మాదిరిగా ఎక్కడి వాళ్ళు అక్కడే అని అనబోరని హామీ ఇస్తారా?
జిల్లాల విభజన జరిగే ముందు మన రాష్ట్రం లో జరుగుతున్న ఈ ట్రాన్స్‌ఫర్ల వలన తక్కువ పాయింట్లు తో సుదూర ప్రాంతాలకు వెళ్ళబోయో పరిస్థితి ఎదురు కాదన్న గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా?
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్దిష్ట హామీను ప్రభుత్వం ఇవ్వాలన్న డిమాండ్ మొదలైంది. అదేవిధంగా జూనియర్ టీచర్లకు ఏవిధమైన ఉపశమనం కల్పిస్తారు అన్న దానిపైనా ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన కనిపిస్తోంది.
Must Read: విద్యా కానుక.. మంచీ చెడూ!
తెలంగాణలో ఏం చేశారు?
తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల పునర్విభజన జరిగింది. మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి. అలాగే.. ఈ జిల్లాల పునర్విభజనకు ముందు- తర్వాత కూడా టీచర్ల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ ఎలాంటి మార్గం అనుసరిస్తున్నారు. జిల్లాల విభజనకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తున్న సమయంలో ఆ పాయింటు చాలా కీలకమైనది.
తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలనే యూనిట్ గా పరిగణిస్తున్నారు. ఆ పరిధిలోకే ఇప్పటికీ బదిలీలకు ప్రామాణికం ఉంటోంది. దాంతో ఇదివరకు ఇప్పటి పరిస్థితులకు ఈ విషయానికి సంబంధించినంత వరకు పెద్ద తేడా లేదు.. ఏపీ లో ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలు ముందే జరుగుతున్న నేపథ్యంలో.. రేపు జిల్లాల విభజన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన సహజంగా రేకెత్తుతోంది.