ఏపీలో రోజుకు 12 వేల కరోనా కేసులు వస్తుంటే వారికి బెడ్లు కేటాయించలేక వైద్యాధికారులు చేతులెత్తేశారు. ఆ వార్తలు మీడియాలో రాకుండా ఉండేందుకే టీడీపీ నేతల అరెస్టులు, వారి భవనాల కూల్చి వేతలు తెరమీదకు తెచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీ సీఎం జగన్ పని దినాల్లో దోచుకోవడానికి, సెలవు దినాల్లో కూల్చివేతలపై పెడుగున్న శ్రద్ధ కరోనాను కట్టడి చేసేందుకు పెట్టడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
దూళిపాళ్ల అరెస్ట్, దేవినేనికి ఊరట
ముందుగా కేసులు పెట్టి నోటీసులు ఇస్తే హైకోర్టును ఆశ్రయిస్తున్నారని భావించిన అధికార పార్టీ అధినేత ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే టీడీపీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులు రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారు. ఇక వారు బెయిల్ కోసం ప్రయత్నించి అది వచ్చే సరికే వారం పడుతుంది. ఈ లోపు మరో టీడీపీ నేతను అరెస్టు చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అంటే ఏపీలో అభివృద్ధి గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తోంటే దానిపై అధికారులతో చర్చించాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపే పనిలో బిజిగా ఉన్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే పాలన ఎలా ఉంటుందో అర్థమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా మాజీ మంత్రి దేవినేనిని అరెస్టు చేయాలని సీఐడీ అధికారులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసి అరెస్టును నిలువరించే తీర్పు పొందారు. దీంతో వెంటనే దూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని తెలుస్తోంది.
కూల్చివేతలు షరామామూలే…
ఏపీలో వారంతంలో ప్రతిపక్ష నేతల భవనాల కూల్చి వేతలు యథావిధిగా జరుగుతున్నాయి. శనివారం అయిందంటే ఏ టీడీపీ నేత భవనాలు కూల్చుతారోనని వారు భిక్కుబిక్కుమంటున్నారు. విశాఖలో అయితే కూల్చివేతలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనం నిర్మాణంలో ఉండగానే కూల్చివేతలు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకున్నా, సెట్ బ్యాక్ వదల్లేదంటూ అధికారులు పొక్రెయిన్లతో తెల్లవారుజామునే విరుచుకుపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలపై ప్రశ్నించిన టీడీపీ నేతలను పోలీసులను పెట్టి అక్కడ నుంచి బలవంతంగా తరలించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు, కూల్చివేతలు, దాడులు తప్పవని అధికార పార్టీ నేతలు చెప్పకనే చెపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాక్షసపాలన సాగుతోంది…చంద్రబాబు
ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని ప్రతిపక్షపార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. సీఎం, మంత్రులు, వైసీపీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనం కూల్చివేతపై చంద్రబాబు స్పందించారు. ఇలాంటి అరాచకపాలన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సీఎం అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పాలనపై ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
Must Read : తిరుపతిలో రత్నప్రభ నామినేషన్.. జనసేన నేతలు దూరం