రాజకీయమన్నాక… ఎన్నెన్నో ఎత్తులు, వాటికి పై ఎత్తులు… ప్రత్యర్ధిని చిత్తు చేసే వ్యూహాలు, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించే ప్రణాళికలు… ఇవన్నీ దాదాపుగా అన్ని పార్టీలు అనుసరించే వ్యూహాలే. అయితే రాజకీయ పార్టీ అన్నాక…. రాజ్యంగం సూచించిన మేరకు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తూ చా తప్పకుండా పాటించాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి అలా ఓ వైపు రాజకీయ వ్యూహాలు రచిస్తూనే… మరోవైపు నిబంధనలను పాటిస్తూ సాగుతున్న పార్టీల్లో ఏ పార్టీ ఎక్కడ? అన్న విషయానికొస్తే… ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు కూడా తెలుగు దేశం పార్టీ ఆదర్శంగా నిలిచిందని చెప్పక తప్పదు.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా..
ఆయా పార్టీలకు ఏటా చేకూరుతున్న ఆదాయం. చేసిన ఖర్చులను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. అలాంటి గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా కొనసాగుతున్న వైసీపీ, టీఆర్ఎస్‌లు విఫలమయ్యాయి. ఈ పార్టీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు కూడా తెలుగు దేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది. గతేడాదికి సంబంధించి తనకు అందిన ఆదాయంతో పాటు తాను చేసిన ఖర్చులను కూడా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. దేశంలో లెక్కలేనన్ని పార్టీలు ఉన్నా… టీడీపీ మాదిరిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ వ్యయాలను అందించినవి 19 పార్టీలు మాత్రమే. ఇలా తమ ఆదాయ వ్యయాలను బయటపెట్టిన పార్టీల్లో చోటు దక్కించుకుని టీడీపీ తన నిబద్ధతను మరోమారు చాటుకుంది. ఏటా క్రమం తప్పకుండానే తన ఆదాయ వ్యయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తూ వస్తున్న టీడీపీ… ఈ దఫా కూడా ఏ ఒక్కరూ తనను వేలెత్తిచూపకుండా ఉండేలా తన ఆదాయ వ్యయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసి దేశంలో అధికారం వెలగబెడుతున్న చాలా పార్టీలకు ఆదర్శంగా నిలిచింది.

కార్యకర్తల సంక్షేమంపై టీడీపీ దృష్టి
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అందజేసిన ఆదాయవ్యయాలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీడీపీకి మొత్తంగా రూ.91.53 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అదే సమయంలో ఆ పార్టీ వివిధ అవసరాల కోసం 2019-20 ఏడాదికి సంబంధించి మొత్తం మీద రూ.108.84 కోట్లను ఖర్చు చేసింది. అంటే… ఆదాయానికి మించి టీడీపీ ఖర్చు చేసిందన్న మాట. విపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి ఇప్పుడు పెద్దగా విరాళాలేమీ వచ్చే పరిస్థితి లేదు. అయితే ఏళ్ల తరబడి క్రమానుగతంగా పార్టీ చేపట్టిన క్రమశిక్షణాయుతమైన చర్యల ద్వారా విరాళాలు లేకున్నా… ఓ మోస్తరు నికర ఆదాయం అయితే వస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఆ పార్టీకి రూ.91.53 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అధికారంలో లేకున్నా… పార్టీ కేడర్ పై తనదైన శైలిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్న టీడీపీ… ఆదాయానికి మించి రూ.108.84 కోట్లను ఖర్చు చేయక తప్పలేదు. కార్యకర్తల సంక్షేమం పట్ల దేశంలోని అన్ని పార్టీల కంటే కూడా మెరుగైన చర్యలు చేపడుతున్న టీడీపీ ఇలా ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిగతా పార్టీల విషయానికొస్తే..
ఇదిలా ఉంటే… పారదర్శకతలో తమను మించిన వారు లేని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ, టీఆర్ఎస్‌లు ఈ ఆదాయ వ్యయాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపే విషయంలో మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపలేదని చెప్పాలి. వాస్తవంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంది. అయితే ఈ రెండు పార్టీలు సహా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ అసలు ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. ఏపీలో వరుసగా జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల క్రతువు సాగుతున్న నేపథ్యంలో టీడీపీ కూడా కాస్త ఆలస్యంగానే తన ఆదాయవ్యయాలను ఈసీకి పంపింది. వరుస ఎన్నికల క్రతువులో ఉన్నా నిర్దేశిత బాధ్యతలను నెరవేర్చడంలో తనకు సాటి రాగల వారెవ్వరూ లేరని టీడీపీ మరోమారు నిరూపించినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.











