తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో రహస్యంగా మిత్ర బంధం కొనసాగిస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. పైకి వైరం ప్రదర్శించినప్పటికీ లోలోన మాత్రం పరస్ఫర లబ్ధి కోసం బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందాలు చేసుకున్నారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఆ మధ్య కేసీఆర్ దేశ రాజకీయాలు అంటూ జోరు మీద ఉన్న సమయంలో ఆయనకి బీజేపీకి వ్యూహాత్మకంగానే అడ్డుకట్ట వేసింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీనే దిగిరాక తప్పలేదని, తమ ప్రయోజనాల కోసం రెండు పార్టీలూ కూడబలుక్కుని ఒప్పందాలు చేసుకున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చేలాగే ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకూ స్వింగ్‌లో ఉన్న తెలంగాణ బీజేపీలో మార్పులు చేసి వెనకపడేలా చేశారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో చిక్కుకున్న సీఎం కుమార్తె కవిత విషయంలో విచారణతోనే సరిపెట్టారు.
ఈ పరిణామాలను బట్టి రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య తమ ప్రయోజనాల కోసం ఒప్పందాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజలు సులువుగానే గుర్తించారు. పైకి శత్రువులుగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మిత్రులేనని జనాలు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందో.. వెంటనే తెలంగాణలో దాని ప్రభావం పడకుండా చూడడం బీజేపీ తొలి ప్రాధాన్యం అయింది. అందుకే సీక్రెట్ గానే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసింది.
అటు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటోంది. రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ వైరం ప్రదర్శిస్తున్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా మెలగడం రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం నచ్చడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చకపోయినా, విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటు వారికి కట్టబెట్టాలనుకుంటున్నా, గన్నవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ కంపెనీకి రాసి ఇస్తున్నప్పటికీ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించదు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ను, ప్రజల్ని వైసీపీ బలిచేస్తోందనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. ఇలా జగన్ తన వ్యక్తిగత లబ్ధి కోసం కూడా కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతుండడం.. భవిష్యత్తులో ఆయనకు ప్రజల నుంచి పెద్ద షాక్ ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.










