ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి రోజు ఆదాయం రూ.300 కోట్లు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పై జేసీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం ప్రజల్లో బాగా ప్రాచుర్యంలో ఉందని జేసీ అన్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తనకు తెలియదన్నారు. డబ్బు, మందు ప్రభావంతోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని ఆయన అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేశారని ఆయన గుర్తు చేశారు. కుప్పంలో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని, దీంతో టీడీపీ పోటీ పడలేకపోయిందని జేసీ వ్యాఖ్యానించారు. జనానికి డబ్బే ముఖ్యమని, డబ్బు ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అదంతా పచ్చి అబద్ధం
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే జనం వైసీపీకి ఓటేశారనేది పచ్చి అబద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన అభివృద్ది జనానికి తెలుసన్నారు. చంద్రబాబు, జగన్ ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నోటు లేనిదే ఓటు వేసే వారు తగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఏపీ పరిస్థితి కాదని, దేశంలో ఎక్కడకు వెళ్లినా ఓటుకు విలువ కడుతున్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- ఒత్తిళ్లు, వేధింపులు.. ఆర్థిక మూలాలే వైసీపీ టార్గెట్











