యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం)’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరో రామ్ చరణ్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటూండడం అభిమానుల్లో అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. డివివి దానయ్య భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు సంబంధించి చెర్రీ బర్ట్ గిఫ్ట్ గా యన్టీఆర్ అందించిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఆ టీజర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు చరణ్ . చరణ్ టీజర్ కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
ఇప్పడు కొమరం భీం అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ పై కట్ చేసిన టీజర్ ను అక్టోబర్ 22 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ టీజర్ ప్రారంభం కానుందట. కొమరం భీం గొప్పతనాన్ని చరణ్ తన మాటల్లో వినిపించనున్నాడు. అయితే తారక్ టీజర్ పై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ అంటేనే అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. వీళ్ళ కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘ఆర్ ఆర్ ఆర్’ నాలుగోవ సినిమా కావడంతో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు అక్టోబర్ 22 కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. రాబోయే 48 గంటలు వాళ్లకు నాలుగు యుగాలుగా గడుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి అసలు లేనేలేదు. నిజానికి తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీం టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే కరోనా కారణంగా చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల కుదరలేదు. ఇప్పుడు షూటింగ్ ఒక కొలిక్కి రావడంతో టీజర్ ను చిత్ర బృందం విడుదల చేస్తుంది. కొమరం భీం టీజర్ లో ఎన్టీఆర్ ను రాజమౌళి ఎలా చూపించాడో తెలియాలంటే 48గంటలు ఆగాల్సిందే మరి.











