ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తికావచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవరికి వారు తమ సినిమాల ప్లానింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈలోగా టీవీ హోస్ట్ గా ఎన్టీఆర్ మనముందుకు రాబోతున్నారన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడిది ప్రచారం కాదు అధికారిక వార్తే అనుకోవాలి. రేపు అధికారికంగా ఈ విషయం వెల్లడి కానుంది. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటనుకున్నారా? ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ అనేదే ఆ కార్యక్రమం. అదేంటి అది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కదా అన్న సందేహం మీకు కలుగుతోంది కదూ.
స్టార్ మా నిర్వహించింది మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’జెమినీ టీవీ నిర్వహించబోతోంది. దీనికి ఆ సంస్థ యాజమాన్యం ఎన్టీఆర్ ను అడగడం, ఆయన ఓకే చెప్పేయడ కూడా జరిగిపోయింది. హోస్ట్ గా ఎన్టీఆర్ కు ఇది మొదటిసారి కాదు. మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నాగార్జున నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరో టీవీకి చేరింది. నాగార్జున స్థానంలో ఎన్టీఆర్ చేరారు. వెండి తెర అయినా బుల్లి తెర అయినా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించడం మాత్రం ఖాయం.
ఎందుకంటే గతంలో బిగ్ బాస్ హోస్ట్ చేసినప్పుడు కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. నాగార్జున తర్వాత ఆ కార్యక్రమాన్ని అంతలా రక్తి కట్టించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బుల్లితెరపై తారక్ రీఎంట్రీ ఇస్తున్నాడు. నాగార్జున నిర్వహించిన కార్యక్రమాన్నే కొంత అటూ ఇటూగా మార్చి దీన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్నపూర్ణ ఏడెకరాల్లో ఓ సెట్ కూడా వేశారు. అక్కడ ప్రోమో షూట్ చేశారు. బహుశా రేపు ఈ ప్రోమోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
అతి త్వరలోనే ఈ షో కోసం ఎంట్రీలు కూడా తీసుకుంటారు. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఒక్కో ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. నిజానికి ఇది గత ఏడాది ప్రారంభం కావలసి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఈ బుల్లి తెర షూటింగ్ చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఎన్టీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు.
Also Read : సినీ, రాజకీయ రంగాల్లో.. ఎన్టీఆర్ ఓ లెజెండ్..!











