Kadapa District Resident Who Released A Selfie Video Of Himself Committing Suicide :
ఏపీలో వైసీపీ పాలన మొదలయ్యాక.. పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్టుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఈ తరహా వైసీపీ మార్కు పోలీసింగ్ ఫలితంగా మొన్నామధ్య కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం తన కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెను కలకలమే రేపింది. ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలో కూడా ఈ తరహా ఘటనే చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఇప్పటికైతే స్పందించారు గానీ.. ఈ సమస్యను తీర్చకపోతే మాత్రం సలాం ఘటన తరహాలోనే మరో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషాకు దాన విక్రయం ద్వారా సంక్రమించిన 1.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో సాగుతోనే బాషా తన కటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ భూమిపై దువ్వూరు మండల వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి కన్ను పడిందట. ఈ భూమిని తనకు అప్పగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట. తిరుపాల్ రెడ్డి బెదిరింపులతో బెంబేలెత్తిపోయిన బాషా నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచనతో మైదుకూరు సీఐ కొండారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తొలుత ఫిర్యాదు తీసుకున్న కొండారెడ్డి దానిపై ఎలాంటి కేసు కట్టకుండానే.. న్యాయం చేస్తానంటూ నమ్మబలికారట. అయితే శుక్రవారం నాడు ఏమైందో తెలియదు గానీ.. సీఐ కొండారెడ్డి వైసీపీ నేత తిరుపాల్ రెడ్డికి అనుకూలంగా మారిపోయారట. ఈ క్రమంలో తాను చెప్పినట్టుగా వినకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బాషాను కొండారెడ్డి బెదిరించారట. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో తనదైన మార్కు దౌర్జన్యాన్ని ప్రదర్శించిన కొండారెడ్డి.. బాషాను బూటు కాలితో తన్నడంతో పాటుగా బాషా భార్యను పోలీస్ స్టేషన్ అవతలకు ఈడ్చి పారేశారట.
ఆత్మహత్యే గతి అంటూ వీడియో..
ఈ పరిణామాలతో విషయం ఏమిటో అర్థమైపోయిన బాషా.. కుటుంబ సభ్యులను ముందుంచుకుని ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్న తిరుపాల్ రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన సీఐ కొండారెడ్డి తనపైనే బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తనకు జరిగిన అన్యాయం మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేసిన బాషా.. తన సమస్య పరిష్కారం కాకపోతే.. తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని ఆత్మహత్యే శరణ్యమని తేల్చి చెప్పారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సదరు వీడియో సీఎం జగన్ కు చేరేలా షేర్ చేయాలని కూడా వేడుకున్నారు. 48 గంటల్లోగా తనకు న్యాయం జరగకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆ వీడియోలో బాషా పేర్కొన్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ అయిన ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన వెంటనే కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తక్షణమే స్పందించారు. స్థానిక పోలీసులను అలెర్ట్ చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాషా ఇంటికి చేరుకుని వారిని అనునయించే యత్నం చేస్తున్నారు. మరి బాషాకు న్యాయం ఏ రీతిన జరుగుతుందోనన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీఎంఓ స్పందించింది..
ఈ అంశంపై సీఎం కార్యాలయం స్పందించింది. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీంతో అక్బర్ కుటుంబసభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను అక్బర్ కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామని చెప్పారు. దువ్వూరు పోలీసుల సహకారంతో వారిని కాపాడగలిగామని అన్నారు. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ వ్యవహారంలో సీఐకానీ, ఇతర పోలీసుల తప్పు కానీ ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్బర్ కుటుంబానికి పూర్తి భద్రతను కల్పిస్తానని తెలిపారు.
Must Read ;- అభాగ్యులకు అండ లోకేశే, జగన్ కాదు











