టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సత్తా చాటుతున్నారనే చెప్పాలి. లోకేశ్ దెబ్బకు జగన్ సర్కారు తన మొండి వైఖరిని వీడి.. మృగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అబలల కేసులపై దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ఎర్రబాడు గ్రామానికి చెందిన హజిరాబీ హత్యాచారంపైనా జగన్ సర్కారు సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏడు నెలల క్రితం ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లేందుకు నారా లోకేశ్ యత్నిస్తే.. ఆయనను జగన్ సర్కారు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హజిరాబీ కుటుంబానికి లోకేశ్ న్యాయం
గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఏపీని షేక్ చేసిందనే చెప్పాలి. ఈ ఘటనపై చాలా వేగంగా స్పందించిన నారా లోకేశ్.. రమ్య మృతదేహానికి నివాళి అర్పించేందుకు వెళ్లగా.. పోలీసులు ఆయనను అరెస్డ్ చేసిన సంగతి తెలిసిందే. తాను రంగంలోకి దిగకపోతే కుదరని భావించారో, ఏమో తెలియదు గానీ.. రాష్ట్రంలో ఇప్పటిదాకా చోటుచేసుకున్న అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక వేధింపులు, ప్రేమోన్మాదుల దాడులపై లోకేశ్ కాస్తంత గట్టినే స్పందించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడులో ఏడాది క్రితం హత్యాచారానికి గురైన హజిరాబీ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించారు. తాజాగా నరసరావుపేటకు చెందిన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ ఇలాగే పర్యటనలు సాగిస్తే తమకు ఇబ్బందేనని గ్రహించిన జగన్ సర్కారు.. దిద్దుబాటు చర్యలకు దిగింది.
నిన్న రమ్య కుటుంబానికి ఓదార్పు
లోకేశ్ వరుస పర్యటనలు, గురువారం నాటి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మేల్కొన్న జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. గురువారం నాడు లోకేశ్ ను ఇంటికి పంపిన జగన్ సర్కారు.. సాయంత్రానికంతా రమ్య కుటుంబాన్ని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించింది. హోం మినిస్టర్ సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునలు రమ్య కుటుంబ సభ్యులను సీఎం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రమ్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. తాజాగా హజిరాబీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ జగన్ సర్కారు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా లోకేశ్ దెబ్బకు జగన్ సర్కారు.. అన్యాయం జరిగిన అబలలకు అండగా నిలవడంతో పాటుగా నిందితులను శిక్షించేందుకు కూడా నడుం బిగించిందని చెప్పాలి.
Must Read ;- ఖాకీలకు చుక్కలు చూపిన లోకేశ్











