నిత్యం వివాదాల్లో ఉండే… సినీ విమర్శకుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాంలో కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయాలతో కనిపించిన కత్తి మహేశ్ ను ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో కత్తి మహేశ్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కత్తి మహేశ్ వెంటిలేటర్ పై ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ముఖం, కన్ను, మెదడుకు అయిన గాయాల కారణంగా కత్తి మహేశ్ ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని, మరో మూడు రోజుల తర్వాత గానీ ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియదని కూడా చెప్పినట్లు సమాచారం.
లారీని ఢీకొట్టిన కత్తి మహేశ్ కారు
ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవూలురు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను దాదాపుగా పూర్తిగా దెబ్బ తిన్నట్టే కనిపిస్తోంది. ముఖానికి కూడా పలు చోట్ల గాయాలయ్యాయి. ఇక తలకు కూడా బలమైన గాయాలు కాగా… మెదడుకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కోమాలో మహేశ్.. చెన్నై తరలించే అవకాశం
ప్రమాదం జరిగిన వెంటనే గాయాలతో కనబడ్డ కత్తి మహేశ్ ను స్థానికులు, పోలీసులు హుటాహుటీన నెల్లూరుకు తరలించారు. ఆ తర్వాత నగరంలోని మెడి కవర్ ఆసుపత్రికి వెళ్లిన కత్తి మహేశ్.. చికిత్స నిమిత్తం అందులో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం కత్తి మహేశ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. కత్తి మహేశ్ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఆయన సన్నిహితులు, సినిమా రంగానికి చెందిన దర్శకుడు సాయి రాజేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిలు వెల్లడించారు. బ్రెయిన్ సర్జరీ కూడా అవసరమన్న భావనను వైద్యులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. పరిస్థితులు అనుకూలిస్తే చెన్నైలోని శంకర్ నేత్రాలయ హాస్పిటల్ కు తరలిస్తారన్నారు. మూడు రోజులు గడిస్తే గానీ కత్తి మహేశ్ ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం ఇవ్వలేమని డాక్టర్లు చెప్పారు అని వెల్లడించారు.











