మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పీఠంపై ఇంతవరకూ ఏ మహిళా కూర్చోలేదు. ఈసారి ఈ పదవికి జీవిత, హేమ కూడా పోటీ పడుతున్నారు. ఈ పదవికి పోటీపడుతున్న జీవిత మోహన్ బాబు ప్యానల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయిగానీ దాన్ని జీవిత ఖండిస్తున్నారు.
ఈరోజు నరేష్ తో జరిగే ప్రెస్ మీట్ కు ఆమె హాజరు కావలసి ఉన్నా వెళ్లలేదు. ప్రస్తుతానికి ఆమెకు బరిలో నుంచి తప్పుకునే ఆలోచన ఉన్నట్లు లేదు. జీవిత తర్వాత బరిలో మిగిలింది హేమ. మొదట్నుంచీ హేమ రూటే సపెరేటు అని చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ‘మా’లో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా మా సభ్యుల్లో మహిళలు హేమ వైపే నిలుస్తూ వస్తున్నారు. ఏ ప్యానల్ లోనూ లేకుండానే గత ఎన్నికల్లో ఇండెపెండెంటుగా విజయం సాధించారామె.
నిన్న జరిగిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ ని హేమ గారు పోటీ చేస్తారంటున్నారు.. అని అడిగితే ప్రకాష్ రాజ్ నుంచి పాజిటవ్ సమాధానమే వచ్చింది. ‘హేమ పోటీ చేస్తున్నారనే అంటున్నారు. నేను కూడా ఆమె విషయం గురించి ఎవర్నో అడిగితే హేమగారు ఎక్కువగా మాట్లాడతారు అన్నారు. మాట్లాడతారండీ.. ఒక ఆడది ఇంతమంది మగాళ్ల మధ్యలో ఫైట్ చేస్తుందంటే అంత గట్స్ ఆమెకు ఉన్నాయనే చెప్పాలి. తనకంటూ ఓటు బ్యాంక్ ఆమెకు ఉంది. తను ఎన్నో ప్యానల్స్ లో పనిచేసింది’ అని వివరించారు. హేమకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్న విషయం ప్రకాష్ రాజే ఒప్పుకున్నారు.
గత ఎన్నికల్లో హేమ ఓట్టు..
పోయినసారి మా ఎన్నికల్లో హేమ ఇండిపెండెంటుగా పోటీచేశారు. ఆమె 226 ఓట్లతో విజయం సాధించారు. వాటిలో 175 ఓట్లు మహిళలవే. మహిళా సభ్యుల్లో హేమ మీద పాజిటివ్ కార్నర్ ఉంది. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులుగానీ, మా సభ్యులుగానీ ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్లి అంత్యక్రియలు అయ్యేవరకూ ఉండి వస్తారు. వారికి ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ధన సహాయం, శ్రమ సహాయం చేయడంలో ఆమె ముందుంటుంది. దాంతోపాటు ఆమెకు ఆవేశం కాస్త ఎక్కువే. ఈ మధ్య కాస్త తగ్గించుకున్నట్టు కనిపిస్తున్నారు. కుల పరంగానూ ఆమె కాపు సామాజిక వర్గం. అయినా మెగాస్టార్ మద్దతు ఆమెకు ఎందుకు దక్కలేదో? అధ్యక్ష పదవి నుంచి ఆమె తప్పుకుంటుందా లేదా అన్నది సందేహాస్పదమే. ప్రస్తుతం ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో గమనించి నిర్ణయం తీసుకోవచ్చు.
‘మా’లో మొదట్నుంచీ యాక్టివ్
మా అసోసియేషన్ వ్యవహారాల్లో ఆమె మొదట్నుంచీ క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు. మూడు సార్లు ఈసీ మెంబర్ గా చేశారు. జాయింట్ సెక్రటరీగా ఒకసారి చేశారు. ఉపాధ్యక్షురాలిగానూ అవకాశం వచ్చింది. అయితే ప్రతిసారీ ఆ పదవులు తాను లాక్కున్నవేగానీ ఎవ్వరి సపోర్టూ లేదనే ఆమె అంటుంటారు. ఆడపిల్ల మనతో ఉందని ఎవ్వరూ దయతలవడం లేదనే ఆమె అభిప్రాయం.
‘గత ఎన్నికల్లో కూడా నువ్వు ఓడిపోతే మంచి పోస్టు ఇస్తామని శివాజీ రాజా, నరేష్ అన్నరే తప్ప.. నువ్వు గెలుస్తావు హేమా.. మనందరం కలిసి పనిచేద్దాం అని ఎవరూ అనలేదు’ అని హేమ ఓ సందర్భంలో అన్నారు. గత ఎన్నికల్లో రెండు ప్యానల్స్ ఉండగా మహిళా సభ్యులే హేమని గెలిపించుకున్నారు. మహిళల కోసమే ఈసారి తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ఆమె చెబుతున్నారు. మా అసోసియేషన్ లో ఎవరైనా సహాయం కోసం అడిగితే మొదటి ప్రకటన హేమ నుంచే వస్తుందన్న టాక్ ఉంది.
హేమ వెనక ఎవరున్నారు?
ఇండస్ట్రీ హేమతో ఆడుకుంటోందనే విమర్శ కూడా ఉంది. ప్రస్తుతం పోటీ చిరంజీవికీ మోహన్ బాబుకూ మధ్య పోటీలా అనిపిస్తోంది. జీవిత పోటీలోకి రావడంతో చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల ఓట్లు చీలిపోతాయేమోనని హేమను బరిలోకి దించారన్న ప్రచారం ఉంది. నిజానికి హేమ మొదటి నుంచి కూడా లేడీ ఆర్టిస్టుల పక్షమే. సీనియారిటీ,
సేవా భావం ప్రకారం చూసినా అధ్యక్ష పదవికి అర్హురాలే. కానీ మోహన్ బాబు పట్టు బట్టి ఓట్లు చీల్చి విష్ణుకు గెలుపునకు బాటలు వేయాలని హేమను రెచ్చగొట్టి రంగంలోకి దించారన్న ప్రచారం సినీ వర్గాల్లో ఉంది. అయితే చిరంజీవి వర్గం ఆమెను పోటీ లోంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. జీవిత, మోహన్ బాబులు మీడియా ముందుకు వచ్చాకగానీ హేమ నిర్ణయం ఏమిటో తెలియదు.
– హేమసుందర్
Must Read ;- షాకింగ్ – చిరు మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్స్