తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు బిజెపి నాయకురాలు విజయశాంతి.రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు ఎంతో ఆశతో తొలకరికి పంటలు వేసుకుంటే ఈ వర్షం వారికి తీవ్ర నష్టం కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, ఎకరాకు 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు.
అదేసమయంలో రైతులు కొత్త పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వమే అందించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. పంటల భీమా పథకం అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని.. దాని ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.కేవలం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే, అకాల వర్షాలు, వరదలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని ఆమె విమర్శించారు.
ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్నదాతల పట్ల కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమకు నిదర్శనమంటూ విజయశాంతి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. అది అమలు చేయకపోయినా, దానికి ప్రత్యామ్నాయ పథకాల ద్వారా అయినా వారిని ఆదుకోకపోవడం… కేసీఆర్‌కు రైతన్నల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ చేస్తున్న అరాచక పాలనను ప్రజలు చూస్తునే ఉన్నారని… తొందర్లోనే వారే కేసీఆర్ కు కర్ర కాల్చి వాతపెట్టడం ఖాయమని ఆమె పేర్కొన్నారు.