గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మధ్య టోల్ వార్ సీఎంవోకు చేరింది. నార్కట్ పల్లి – అద్దంకి రాష్ట్ర రహదారిని నిర్మించిన రాంకీ సంస్థ పిడుగురాళ్ల వద్ద టోల్ గేట్ నిర్వహిస్తోంది. అయితే నరసరావుపేట నుంచి ప్రతి రోజూ గురజాలకు వెళ్లే ఎమ్మెల్యే వాహనశ్రేణిలో శాసనసభ్యుడి వాహనం ఒక్కటి మాత్రమే వదిలేసి, మిగిలిన వాహనాలకు టోల్ వసూలు చేస్తున్నారట. దీంతో కాసు మహేష్ రెడ్డికి గుస్సా వచ్చింది. దీంతో సదరు ఎమ్మెల్యే గారికి బీవోటీ రూల్స్ బయటకు తీశారు. రోడ్డు నిర్మించిన రాంకీ సంస్థ రహదారి నిర్వహణ పట్టించుకోవడం లేదని, టోల్ వసూలు చేస్తూ రోడ్డు నిర్వహణ గాలికి వదిలేశారని, రెండు వారాల్లో రోడ్డుపై గుంటలు పూడ్చకుంటే టోల్ గేట్ ముట్టడిస్తామని కాసు హెచ్చరించారు. దీంతో వారిద్దరి మధ్య వ్యవహారం మీడియాలో వైరల్ కావడంతో సీఎంవో నుంచి పిలుపు వచ్చిందట. వీరి పంచాయితీ విన్న వైసీపీ పెద్దలు తలలు పట్టుకున్నారని తెలుస్తోంది.
తనదాకా వస్తేగాని తత్త్వం బోధపడదా.
అద్దంకి – నార్కట్ పల్లి రహదారి అధ్వానంగా తయారైంది. బీవోటీ పద్దతిలో రోడ్డు నిర్మించిన రాంకీ సంస్థ టోల్ వసూలు చేసుకునే బాధ్యతను క్యూబ్ కంపెనీకి అప్పగించింది. టోల్ వసూలు చేస్తున్న రోడ్డు నిర్వహణ కూడా రాంకీ చూడాల్సి ఉంది. అయితే అటు రాంకీ గానీ, క్యూబ్ కంపెనీగానీ రోడ్డు నిర్వహణ గాలికొదిలేశారు. దీంతో వర్షాలకు రోడ్డు ఛిద్రమైపోయింది. ప్రతి రోజూ ఆ రోడ్డుపై తిరుగుతున్న గురజాల ఎమ్మెల్యే కాసుకు ఈ విషయం తెలుసు. అయినా మొదట్లో పట్టించుకోలేదు. టోల్ గేటు వద్ద ఎమ్మెల్యే వాహన శ్రేణిని నిలిపివేయడంతో కాసుకు రోడ్డుపై గుంతలు గుర్తుకు వచ్చాయి. దీంతో రోడ్డుపై గోతులు పూడ్చేందుకు రాంకీ సంస్థకు రెండు వారాల గడువు ఇచ్చారు. అయినా వారు మొద్దునిద్ర వీడలేదు. దీంతో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాకు ఎక్కారు. దీంతో పంచాయితీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరింది.
పంచాయితీ ఏమైంది…
రాంకీ ఛైర్మన్ వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పంచాయితీ విన్న సీఎం జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారట. కేవలం టోల్ ఫీజు చెల్లించేందుకు ఒకే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ పంచాయితీ పెట్టుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నేటికీ అద్దంకి నార్కట్ పల్లి నాలుగు లైన్ల రహదారి బాగుపడలేదు. కానీ ఎమ్మెల్యే వాహన శ్రేణి మాత్రం టోల్ గేట్ వద్ద ఆగకుండా దూసుకుపోతోందని తెలుస్తోంది. అంటే సమస్య పరిష్కారం అయినట్టేగా..!!
Also Read: tdp-stalls-conspiracy-tirupati-mp











