చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూనే ఉంటుంది. జెనరేషన్స్ మారే కొలదీ ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి కాబట్టి కొత్త నటులకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఇక డెబ్యూ మూవీతోనే యూత్ ఐకాన్స్ గా మారిన హీరోలు, హీరోయిన్లు సినీ చరిత్రలో చాలామందే ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లను కొల్లగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తెలుగులో ఇంకా తన తొలి చిత్రం విడుదల కాకుండానే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది కృతి శెట్టి.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఉప్పెన’ చిత్రంలో కృతి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైన రెండే రెండు పాటలతో కుర్రకారుకి క్రష్ గా మారింది ఈ బ్యూటీ. మంగళూరులో జన్మించిన కృతి శెట్టి భరతనాట్యం నేర్చుకుంది. తొలుత మోడలింగ్ లో ప్రవేశించి పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది. అద్వైత స్క్రీన్ నేమ్ తో తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన కృతి కి ‘ఉప్పెన’ తొలి తెలుగు సినిమా.
‘ఉప్పెన’తో పాటు టిక్ టాక్ వీడియోస్ తోనూ టాలీవుడ్ ఆడియెన్స్ మదిని దోచిన కృతి ఇప్పుడో క్రేజీ ఆఫర్ ని తన కిట్టీలో వేసుకుందట. నేచురల్ స్టార్ నానితో నటించే ఛాన్స్ కొట్టేసిందట. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే ఈ చిత్రం పాత కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందబోతుంది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో కలకత్తాని ప్రతిబింబించే సెట్స్ కూడా వేశారట. ఇక ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు కథానాయికలకు స్కోప్ ఉందట.
‘శ్యామ్ సింగ రాయ్’లో ఒక నాయికగా సాయిపల్లవి ఎంపికయ్యింది. ఇప్పటికే ‘ఎమ్.సి.ఎ’లో నాని-సాయి పల్లవి కలసి నటించారు. మరో కీలకమైన కథానాయిక పాత్రకు ‘ఉప్పెన’ భామ కృతి శెట్టిని ఎంపిక చేసుకుందట చిత్రబృందం. ‘వి’ తర్వాత ‘టక్ జగదీష్’తో బిజీగా ఉన్న నాని త్వరలో ‘శ్యామ్ సింగ రాయ్’ని పట్టాలెక్కించనున్నాడు. మొత్తంమీద తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకాకుండానే నానితో తన మలి చిత్రాన్ని సెట్ చేసుకుంది మంగళూరు భామ కృతి శెట్టి. మరి ఇప్పుడు కన్నడ బ్యూటీలకు మంచి అడ్డాగా మారుతున్న టాలీవుడ్ లో కృతి కూడా వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి.