విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు వైసీపీ సర్కారుకి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా వున్నందున పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి తాను లేఖ రాశానని, అయినా పట్టించుకోకుండా మొండిగా విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థుల పాలిట విషమ పరీక్షగా మారనున్న పరీక్షలపై జూమ్ కాన్ఫరెన్స్‌లో విద్యావేత్తలు, టీఎన్ఎస్ఎఫ్ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, న్యాయనిపుణులతో చర్చించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (సీడీఎస్ డిపార్టెంట్)అధ్యయనంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 10 మధ్యలో కోవిడ్ -19 యాక్టివ్ కేసులు అనూహ్యంగా పెరగనున్నాయని తేలిందన్నారు. ఏపీ కరోనా కోరల్లోకి చేరిందని, ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వస్తే మరణమే శరణం అనే దుస్థితిలో విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం ముమ్మాటికీ వారి ప్రాణాలతో చెలగాటమాడటమేనని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని, కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించమని తేల్చేసిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సర్కారు కూడా టెన్త్ పరీక్షలు రద్దుచేసి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
నెలలో 24 రెట్లు పెరిగిన యాక్టివ్ కేసులు
ఏపీలో కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రేటు దేశం మొత్తం రేటు కంటే 12.5శాతం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలరోజుల్లో యాక్టివ్ కేసులు 24 రెట్లు పెరిగాయని ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19తో ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఓ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ ప్రకటించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్‌గోపాల్, విద్యావేత్తలు, న్యాయవాదులు శ్రీవెంకటేశ్, తెలుగు యువత నాయకుడు కిలారు నాగశ్రవణ్‌లతో కూడిన కమిటీ ప్రమాదకర పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని లోకేష్ తెలిపారు.
Must Read ;- కరోనా కట్టడిపై ఏపీ మార్కు భాష్యం.. పది పరీక్షలు జరుపుతారట